Hotel Style Red Chutney : మనకు హోటల్స్ లో వివిధ రకాల అల్పాహారాలు లభిస్తూ ఉంటాయి. ఈ అల్పాహారాలను రెండు లేదా మూడు రకాల చట్నీలతో సర్వ్ చేస్తూ ఉంటారు. వాటిలో రెడ్ చట్నీ కూడా ఒకటి. పల్లీ చట్నీ, అల్లం చట్నీలతో పాటు హోటల్స్ లో రెడ్ చట్నీని కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. రెడ్ చట్నీ కూడా చాలా రుచిగా, ఇడ్లీ, దోశ, వడ వంటి వాటిని ఈ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెడ్ చట్నీని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే చాలా సులభంగా ఈ చట్నీని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం చట్నీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేయవచ్చు. అల్పాహారాలలోకి హోటల్ స్టైల్ రెడ్ చట్నీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టీ స్పూన్స్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 5, అల్లం – ఒక చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 5, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాటాలు – 3, చింతపండు – ఒక రెమ్మ,పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
రెడ్ చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మినపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత టమాట ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముక్కలు చల్లారిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పుట్నాల పప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చితో తాళింపు చేసి చట్నీలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రెడ్ చట్నీ తయారవుతుంది. దీనిని ఏ అల్పాహారంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా హోటల్ స్టైల్ రెడ్ చట్నీని ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు.