Egg Ghee Roast : కోడిగుడ్డుతో చాలా మంది రకరకాల వంటలను చేస్తుంటారు. కోడిగుడ్లను ఉపయోగించి చేసే ఏ వంటకం అయినా సరే చాలా రుచిగా ఉంటుంది. వీటిని వివిధ రకాలుగా వండుకుని ఆరగిస్తుంటారు. అయితే కోడిగుడ్లతో ఎంతో రుచికరమైన ఎగ్ ఘీ రోస్ట్‌ను కూడా చేయవచ్చు. ఇది భలే రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ ఘీ రోస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన గుడ్లు – 7, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, సోంపు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – అర టీస్పూన్, లవంగాలు – 6, దాల్చిన చెక్క – ఒక ముక్క, ఎండు మిర్చి – 12, నెయ్యి – పావు కప్పు, ఉల్లిపాయలు – రెండు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు – రెండు, టమాటాలు – రెండు, పసుపు – అర టీస్పూన్, ఉప్పు – తగినంత.
ఎగ్ ఘీ రోస్ట్‌ను తయారు చేసే విధానం..
స్టవ్ మీద కడాయి పెట్టి ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు మిర్చి వేయించుకుని ఆ తరువాత మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి వేయించుకుని పొడిచేసిన మసాలాతోపాటు మిగిలిన పదార్థాలను వేసి బాగా కలిపి పావు కప్పు నీళ్లు పోయాలి. ఈ కూర దగ్గరకు అయ్యాక ఉడికించిన గుడ్లు వేసి బాగా కలిపి దింపేయాలి. దీంతో రుచికరమైన ఎగ్ ఘీ రోస్ట్ తయారవుతుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీలు, రోటీ, పుల్కా.. వేటితో తిన్నా సరే ఈ కూర రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.