Egg Malai Masala : మనం కోడిగుడ్లతో చేసుకోదగిన వివిధ రకాల రుచికరమైన కూరలల్లో ఎగ్ మలై మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. పాలు పోసి చేసే ఈ ఎగ్ మసాలా కర్రీ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చేసుకోవడానికి ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కర్రీ కావాలని అడగక మానరు. ఎంతో కమ్మగా ఉండే ఈ ఎగ్ మలై మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ మలై మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ముప్పావు కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు – 100 గ్రా., పచ్చిమిర్చి – 5, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం -ఒక టేబుల్ స్పూన్, చిక్కటి పాలు – 750 ఎమ్ ఎల్, ఉడికించిన కోడిగుడ్లు – 4, తరిగిన కొత్తిమీర -కొద్దిగా.
ఎగ్ మలై మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కోడిగుడ్లను నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ధనియాల పొడి, కారం, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత పాలు పోసి కలపాలి. దీనిని చిక్కటి గ్రేవీ అయ్యే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. గ్రేవీ దగ్గర పడిన తరువాత కట్ చేసుకున్న కోడిగుడ్లు వేసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ మలై మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.