Eggs Freshness Test : కోడిగుడ్లు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కోడిగుడ్లను అందరూ తింటారు. నాన్‌వెజ్ తినని వారు కొందరు గుడ్లను తినేందుకు ప్రాధాన్యతను ఇస్తారు. చాలా మంది కోడిగుడ్లను ఆమ్లెట్ లేదా ఉడకబెట్టి తింటారు. కొందరు కూరల రూపంలో చేసి తింటారు. అయితే కోడిగుడ్డు సంపూర్ణ పౌష్టికాహారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందువల్ల కోడిగుడ్డును రోజుకు ఒకటి తినాలని.. దీంతో అన్ని పోషకాలను మనం పొందవచ్చని చెబుతున్నారు. కోడిగుడ్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే మనం అధికంగా ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు.
అయితే కోడిగుడ్లను సహజంగానే మనం షాపుల్లో కొని తెస్తుంటాం. సూపర్ మార్కెట్‌లలో ప్యాక్ చేయబడిన గుడ్లు అయితే వాటిపై ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. కనుక ఆ తేదీలోగా మనం వాటిని సులభంగా వాడుకోవచ్చు. కానీ వేరే దుకాణాల్లో.. ఇతర చోట్ల గుడ్లను కొంటే అవి తాజాగా ఉన్నాయా.. కుళ్లిపోయాయా.. అన్న విషయం తెలియదు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల కోడిగుడ్లు తాజాగా ఉన్నాయో లేదో ఇట్టే తెలిసిపోతుంది. కోడి.. గుడ్లను ఎప్పుడు పెట్టిందో కూడా కనుక్కోవచ్చు. అందుకు ఏమేం చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్లు తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే.. ఏదైనా గుడ్డును తీసుకుని దీన్ని వాసన చూడాలి. కోడిగుడ్లు పాడైపోతే పచ్చివి కూడా వాసన వస్తాయి. అలా వస్తే వాటిని పాడైనవిగా గుర్తించాలి. వాటిని పడేయాలి. ఇక కోడిగుడ్డు పెంకును బాగా పరిశీలించాలి. దానిపై పగుళ్లు వచ్చినా లేదా ఏదైనా పౌడర్ ఉన్నట్లు అనిపించినా గుడ్డు బాగా లేదని నిర్దారించుకోవాలి. అలాంటి గుడ్లను పడేయాలి. అలాగే కోడిగుడ్లను నీళ్లలో వేసి కూడా వాటిని తాజదనాన్ని పరిశీలించవచ్చు. కింద ఇచ్చిన చిత్రాన్ని ఒకసారి గమనించండి.
ఒక పాత్రలో మంచి నీటిని తీసుకుని అందులో గుడ్డును వేయాలి. అది మునిగిపోకుండా తేలితే ఆ గుడ్డు బాగా పాతది అని గుర్తించాలి. చాలా రోజుల కిందట కోడి ఆ గుడ్డును పెట్టిందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి గుడ్లను వాడరాదు. వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే గుడ్డు పూర్తిగా మునిగి అడుగు భాగానికి చేరి అడ్డంగా ఉంటే.. అది తాజాగా ఉన్నట్లు అర్థం. అలాంటి గుడ్డును వాడుకోవచ్చు.
ఇక గుడ్డు పూర్తిగా మునిగి అడుగు భాగానికి చేరినా కూడా కాస్త పైకి ఉన్నట్లు అనిపిస్తే ఆ గుడ్డును సుమారుగా వారం కిందట కోడి పెట్టి ఉంటుందని నిర్దారించుకోవాలి. అలాగే గుడ్డు మునిగి అడుగు భాగంలో ఉన్నప్పటికీ అది నిలువుగా పై వైపునకు ఉంటే ఆ గుడ్డును కోడి.. 2-3 వారాల కింద పెట్టి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇలా కోడిగుడ్ల తాజాదనాన్ని పరిశీలించవచ్చు. అయితే ఈ చిట్కాల వల్ల కూడా కొన్ని సార్లు కోడిగుడ్లు తాజాగా ఉన్నాయా.. లేదా.. అన్న విషయం తెలియదు. కానీ కోడిగుడ్డును పగలగొట్టి చూస్తే అర్థమవుతుంది. దుర్వాసన వచ్చినా.. పసుపు పచ్చ సొన మొత్తం కలసి పోయినట్లు ఉన్నా.. గడ్డ కట్టినా.. అలాంటి గుడ్లు పాడయ్యాయని తెలుసుకోవాలి. ఇలా కోడిగుడ్లను పరిశీలించి అవి పాడయ్యాయా.. లేదా.. అన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.