Endu Royyala Fry : మనం ఆహారంలో భాగంగా అప్పుడప్పుడూ ఎండు రొయ్యలను కూడా తింటూ ఉంటాం. ఎండు రొయ్యలతో కూరలను లేదా పులుసును తయారు చేస్తుంటారు. వీటిని తినడం వల్ల కూడా మన శరీరానికి మేలు కలుగుతుంది. వీటిని కూరలను, పులుసుగానే కాకుండా ఫ్రై గా చేసుకుని కూడా తినవచ్చు. ఎండు రొయ్యల ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మనకు మార్కెట్ లో ఎండు రొయ్యల ప్యాకెట్ లు కూడా లభ్యమవుతాయి. ఎండు రొయ్యలతో ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు రొయ్యల ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు రొయ్యలు – ఒక కప్పు, కరివేపాకు – అర కప్పు, ఉప్పు – ఒక టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్.
ఎండు రొయ్యల ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఎండు రొయ్యల తలలను, తోకలను తీసేసి శుఢ్రంగా కడిగి ఒక గంట పాటు శుభ్రమైన వస్త్రంపై వేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టుకున్న ఎండు రొయ్యలను కళాయిలో వేసి మధ్యస్థ మంటపై వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత నూనెను, కరివేపాకును వేసి కరివేపాకు కరకరలాడే వరకు వేయించుకోవాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎండురొయ్యల ఫ్రై తయారవుతుంది. దీనిని గాలి తగలని డబ్బాలో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుంటే నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. వీటిని నేరుగా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉండడమే కాకుండా వాటి వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.