Garlic Butter Naan : మనకు బయట రెస్టారెంట్ లలో, హోటల్స్ లో లభించే ఆహార పదార్థాల్లో గార్లిక్ నాన్ కూడా ఒకటి. మసాలా కూరలతో కలిపి తింటే ఈ గార్లిక్ నాన్ ఎంతో రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ నాన్ లను ఇంట్లో చేసుకోవడానికి వీలు పడదని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ బయట దొరికే విధంగా ఉండే ఈ నాన్ లను మనం ఇంట్లోనే చాలా సలుభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మెత్తగా, రుచిగా ఉండేలా గ్లారిక్ నాన్ లనుఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లారిక్ బటర్ నాన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – రెండు కప్పులు, ఉప్పు – తగినంత, పంచదార పొడి – ఒక టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూన్, వంటసోడా – అర టీ స్పూన్, పెరుగు – అర కప్పు, నీళ్లు – తగినన్ని, కరిగిన వెన్న – 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 5, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
గ్లారిక్ బటర్ నాన్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని, ఉప్పును, పంచదార పొడిని, బేకింగ్ పౌడర్ ను, వంటసోడాను వేసి కలుపుకోవాలి. తరువాత పెరుగును, తగినన్ని నీళ్లను పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు బాగా కలపాలి. తరువాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసి మరో 5 నిమిషాల పాటు కలపాలి. తరువాత ఈ గిన్నెపై మూత ఉంచి పిండిని 20 నిమిషాల పాటు నాననివ్వాలి.
తరువాత వెల్లుల్లి రెబ్బలను చిన్నగా తరగడం కానీ లేదా వాటిని తురుమడం కానీ చేయాలి. తరువాత ఒక గిన్నెలో కరిగిన బటర్ ను తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బల తురుమును, కొత్తిమీరను వేసి కలపాలి. ఇప్పుడు పిండిని మరో 2 నిమిషాల పాటు కలిపి తగినంత పిండిని తీసుకుని మిగిలిన పిండిపై మూతను ఉంచాలి. ఇప్పుడు పిండిని ముద్దగా చేసి పొడి పిండిని వేసుకుంటూ మనకు కావల్సిన ఆకారంలో నాన్ లా వత్తుకోవాలి. ఈ నాన్ ను మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా వత్తుకోవాలి.
ఇలా వత్తుకున్న తరువాత ఈ నాన్ కు ఒకవైపు అంతా నీళ్ల తడిని రాయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడయ్యాక నీళ్లు రాసిన వైపు నాన్ ను పెనం మీద ఉంచాలి. నీళ్లు రాయడం వల్ల నాన్ పెనానికి అతుక్కుని బాగా కాలుతుంది. 1 లేదా 2 నిమిషాల తరువాత నాన్ ను పెనం నుండి వేరు చేయాలి. ఈ నాన్ ను మరో వైపు నేరుగా మంట మీద ఉంచి అన్ని దిక్కులా కాలే వరకు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత దీనిపై ముందుగా కలిపి పెట్టుకున్న వెన్నను రాసి ముక్కలుగా చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల అచ్చం మనకు బయట రెస్టారెంట్ లలో దొరికే విధంగా ఉండే గ్లారిక్ నాన్ తయారవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల గ్లారిక్ నాన్ మెత్తగా, రుచిగా ఉంటుంది. ఈ నాన్ ను మసాలా కూరలతో, గ్రేవీ కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.