Multi Dal Dosa : మనలో చాలా మంది దోశలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. దోశలను తయారు చేయడం చాలా సులభం. పిండి తయారుగా ఉండాలే కానీ వీటిని తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అయితే ఈ దోశలను మనం మరింత రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసేలా రుచిగా దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మల్టీ దాల్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరగుళ్లు – ఒక కప్పు, మినప పప్పు – అర కప్పు, శనగ పప్పు – పావు కప్పు, బియ్యం – పావు కప్పు, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – కొద్దిగా, క్యారెట్ తురుము – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – కొద్దిగా, నూనె – అర కప్పు.
మల్టీ దాల్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసరగుళ్లను, మినప పప్పును, శనగ పప్పును, బియ్యాన్ని వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పిండిలో తగినంత ఉప్పును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడయ్యాక తగిన మోతాదులో పిండిని తీసుకుని పలుచని దోశలా వేసుకోవాలి.
తరువాత ఈ దోశపై క్యారెట్ తురుమును, ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీరను, పచ్చి మిర్చి ముక్కలను చల్లుకోవాలి. తరువాత కొద్దిగా నూనెను కూడా చల్లి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉంచాలి. తరువాత మూత తీసి దోశను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మల్టీ దాల్ దోశ తయారవుతుంది. దీనిని ఎటువంటి చట్నీతో అయినా తినవచ్చు. ఇలా వివిధ రకాల పప్పులను ఉపయోగించి చేయడం వల్ల దోశలు రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.