Ginger Candy : జింజర్ క్యాండీలు.. అల్లంతో చేసుకోదగిన రుచికరమైన పదార్థాల్లో ఇది కూడా ఒకటి. అల్లంతో ఇలా జింజర్ క్యాండీలను తయారు చేసి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. వాంతులు, వికారం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు జింజర్ క్యాండీలను తినడం వల్లమంచి ఫలితం ఉంటుంది. ఈ జింజర్ క్యాండీలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. రుచితో పాటుగా ఆరోగ్యాన్ని అందించే ఈ జింజర్ క్యాండీలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జింజర్ క్యాడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – అర కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – 2 టీ స్పూన్స్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – పావు టీ స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నిమ్మరసం – 4 చుక్కలు, పటిక బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్స్.
జింజర్ క్యాడీ తయారీ విధానం..
ముందుగా అల్లంపై ఉండే పొట్టును తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత అల్లం ముక్కలను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, నీళ్లు వేసి కలపాలి. బెల్లం కరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్, యాలకుల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మధ్యస్థ మంటపై కలుపుతూ ఉడికించాలి. బెల్లం మిశ్రమం ఉండ చేయడానికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలపాలి.
తరువాత మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత చేతులకు పటిక బెల్లం పొడిని రాసుకుంటూ బెల్లం మిశ్రమాన్ని తీసుకుని ఉండలాగా చేసుకోవాలి. తరువాత ఈ ఉండను పటిక బెల్లం పొడిలో వేసి కోటింగ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జింజర్ క్యాండీలు తయారవుతాయి. ఇవి నెల నుండి రెండు నెలల పాటు తాజాగా ఉంటాయి. ఇలా అల్లంతో జింజర్ క్యాండీలను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.