Ginger Plants : మనం అనేక రకాల పూల మొక్కలను, పండ్ల మొక్కలను, కూరగాయల మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. కానీ మనం వంటల్లో వాడే అల్లాన్ని ఇంట్లో పెంచుకోవడానికి మాత్రం చాలా మంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అల్లాన్ని పెంచడం చాలా కష్టమైన పని అని భావిస్తూ ఉంటారు. కానీ ఇతర కూరగాయలు, పండ్ల వలె అల్లాన్ని కూడా మనం చాలా సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు. మొదటిసారి ప్రయత్నించే వారు కూడా అల్లాన్ని సులభంగా ఇంట్లో ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మనం తాజాగా ఉండే అల్లాన్ని ఎంచుకోవాలి. అలాగే అల్లం మరీ లేతగా ఉండకుండా చూసుకోవాలి.
ఈ అల్లాన్ని మనం నేరుగా మట్టిలో నాటవచ్చు లేదా కొద్దిగా మొలకలు వచ్చిన తరువాత కూడా మట్టిలో నాటవచ్చు. అల్లాన్ని జాలి సంచిలో ఉంచి మూట కట్టి గాలి, వెలుతురు తగిలే చోట ఉంచాలి. ఇలా చేయడం వల్ల అల్లం నుండి మొలకలు వస్తాయి. అలాగే అల్లం ముక్కలను గిన్నెలో తీసుకుని అవి కొద్దిగా మునిగే వరకు నీటిని పోయాలి. తరువాత వాటిపై మందంగా ఉడే వస్త్రాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల అల్లం నుండి వేర్లు, మొలకలు వస్తాయి. వీటిని కూడా మట్టిలో నాటవచ్చు. ఎలా నాటిన కూడా మనం తీసుకునే అల్లం ముక్కకు పక్కలకు మరో రెండు కొమ్ములు ఉండేలా చూసుకోవాలి.
తరువాత అల్లాన్ని నాటడానికి వెడల్పుగా లోతు తక్కువగా ఉండే కుండీని తీసుకోవాలి. అలాగే అల్లాన్ని పెంచడానికి కంపోస్ట్ ఎరువు, కోకో పీట్, ఇసుక ఎక్కువగా ఉండేలా చూసుకుని మట్టి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కుండీని తీసుకుని దానికి రంధ్రాలు చేయాలి. తరువాత ఈ రంధ్రాలను రాళ్లతో మూసివేసి కంపోస్ట్ ఎరువు, ఇసుక, కోకోపీట్, మట్టిని కలిపి వేసుకోవాలి. తరువాత ఇందులో అల్లం ముక్కలను నాటాలి. నాటే ప్రతి అల్లం ముక్కకు మధ్యలో 8 నుండి 10 ఇంచుల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇలా నాటిన తరువాత వాటిపై మరి కొద్దిగా మట్టిని వేసుకోవాలి. అలాగే గాలి, వెలుతురు తగిలే చోట ఈ కుండీని ఉంచి రోజూ నీటిని చల్లుతూ ఉండాలి.
రెండు వారాలకు ఈ అల్లం నుండి మొలకలు, చిన్న చిన్న ఆకులు రావడం మొదలవుతుంది. వీటికి మధ్య మధ్యలో కంపోస్ట్ ఎరువు వేస్తూ ఉండాలి. మనం నాటిన అల్లం నుండి మరలా అల్లం సేకరించడానికి దాదాపు 6 నుండి 8 నెలల సమయం పడుతుంది. అల్లం పూర్తిగా తయారైన తరువాత మొక్క యొక్క ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతూ ఉంటాయి. ఇలా ఆకులు రంగు మారగానే అల్లాన్ని సేకరించి వంటల్లో వాడుకోవాలి. ఈ విధంగా ఆర్గానిక్ అల్లాన్ని ఇంట్లోనే పెంచుకుని చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.