Snake : పాములు పగబడుతాయని మన పెద్దలు చెబుతుంటారు. అవి పగబడితే మనం ఎక్కడ దాక్కుని ఉన్నా వచ్చి కాటు వేస్తాయని అంటుంటారు. ఇలాంటి సంఘటనలు పురాణాల్లో చాలా జరిగాయి. అయితే తాజాగా అక్కడ కూడా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. పాము పగబట్టిందా.. అన్నట్లుగా ఆ యువతిని 2 సార్లు ఇది వరకే పాము కాటు వేసింది. కానీ ఆమె బతికిపోయింది. అయితే మూడోసారి మాత్రం మృత్యువు నుంచి ఆమె తప్పించుకోలేకపోయింది. ఆమెను మూడోసారి పాము కాటు బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఆదిలాబాద్ లోని బేల మండలం బెదోడకు చెందిన బాలేరావు సుభాష్, రంజన అనే దంపతుల కుమార్తె ప్రణాళి (18) హోలీ పండుగ సందర్భంగా తన స్నేహితులతో కలిసి హోలీ ఆడుతోంది. ఈ క్రమంలోనే వారిపై చల్లేందుకు రంగులు తెద్దామని ఇంట్లోకి వెళ్లింది. తన బ్యాగులో ఉన్న రంగులను బయటకు తీసింది. అయితే ఆ ప్రయత్నంలో అప్పటికే ఆ బ్యాగులో ఉన్న పాము ఆమెను కాటేసింది. దీంతో ఆమెను హుటాహుటిన అక్కడి రిమ్స్‌కు తరలించారు.
అయితే ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమార్తె చనిపోవడంతో ఆ కుటుంబం పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. కాగా ఆమెకు గత 7 నెలల్లోనే రెండు సార్లు పాము కాటు వేసింది. కానీ ఆమె బతికిపోయింది. అయితే ఈసారి పాము కాటుతో ఆమె కానరాని లోకాలకు వెళ్లిపోయింది. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.