Goja Sweet : గోజా స్వీట్.. బెంగాల్ ఫేమస్ వంటకమైన ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉండే ఈ స్వీట్ ను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ స్వీట్ ను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మొదటిసారి చేసేవ వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, మెత్తగా ఉండే ఈ గోజా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోజా స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, కుంకుమ పువ్వు – చిటికెడు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నిమ్మరసం – 4 లేదా 5 చుక్కలు, మైదాపిండి – ఒకటిన్నర కప్పు, వంటసోడా – పావు టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గోజా స్వీట్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలపాలి. ఈ పంచదారను గులాబ్ జామున్ పాకం కంటే ఎక్కువగా తీగ పాకం కంటే తక్కువగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో వంటసోడా, నెయ్యి వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని చేత్తో మందంగాఉండే చపాతీలా వత్తుకోవాలి. తరువాత నాలుగు భాగాలుగా కట్ చేసి ఒకదాని మీద ఒకటి ఉంచి మరలా చేత్తో మందంగా ఉండే చపాతీలా వత్తుకోవాలి. దీనిని మరలా నాలుగు భాగాలుగా కట్ చేసి ఒక దాని మీద ఒకటి ఉంచి మరలా వత్తుకోవాలి.
ఇలా 3 నుండి 4 సార్లు చేయాలి. చివరిగా మందంగా ఉండే చపాతీలా వత్తుకుని దీర్ఘచతురస్రాకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక కట్ చేసుకున్న గోజాలను వేసి చిన్న మంటపై కాల్చుకోవాలి. ఇలా వీటిని కాలుస్తుండగానే మరో స్టవ్ మీద సిద్దం చేసుకున్న పంచదార పాకాన్ని ఉంచి మరలా వేడి చేయాలి . ఈ గోజాలను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని వేడి వేడి పంచదార పాకంలో వేసుకోవాలి. ఈ పాకాన్ని గోజాలకు మూడు నుండి నాలుగు నిమిషాల పాటు పట్టించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోజాలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు గోజాలను తయారు చేసుకుని తినవచ్చు.