Gongura Endu Royyala Iguru : మనం ఆహారంగా అనేక రకాల ఆకు కూరలను తింటూ ఉంటాం. ఆకు కూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మన ఆహారంగా తీసుకునే ఆకు కూరల్లో గోంగూర కూడా ఒకటి. దీనిని తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. రక్త హీనతన సమస్యను తగ్గించడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో గోంగూర ఎంతో ఉపయోగపడుతుంది. గోంగూరను ఉపయోగించి పచ్చడిని, పప్పును తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోంగూర మటన్, గోంగూర చికెన్ వంటి నాన్ వెజ్ వంటకాలను కూడా తయారు చేస్తున్నాం. ఇవే కాకుండా గోంగూరతో మరొక నాన్ వెజ్ వంటకాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ వంటకమే గోంగూర ఎండురొయ్యల ఇగురు. గోంగూరను ఎండురొయ్యలను కలిపి చేసే ఈ ఇగురు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర ఎండురొయ్యల ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – ఒక కట్ట (పెద్దది), ఎండు రొయ్యలు – పావు కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, పచ్చి మిర్చి – 5, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – అర టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 2.
గోంగూర ఎండురొయ్యల ఇగురు తయారీ విధానం..
ముందుగా ఎండు రొయ్యల తలలను, తోకలను తీసేసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తరువాత పచ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. తరువాత గోంగూర ఆకులను వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గోంగూరను పూర్తిగా ఉడికించుకోవాలి. ఈ గోంగూర చల్లారిన తరువాత జార్ లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళాంపు గింజలను వేసి తాళింపు చేసుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకును, ఎండు మిర్చిని వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా అయిన తరువాత కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న గోంగూరను వేసి కలుపుకోవాలి. కూర మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీటిని పోసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర ఎండు రొయ్యల ఇగురు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకండా గోంగూర, ఎండు రొయ్యలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.