Egg Dosa : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా దోశలను తయారు చేస్తూ ఉంటాం. వీటి రుచి గురించి మనందరికీ తెలిసిందే. ప్లెయిన్ దోశలే కాకుండా వివిధ రకాల దోశలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో ఎగ్ దోశ కూడా ఒకటి. ఎగ్ దోశ కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఎగ్ దోశను మరింత రుచిగా.. మరింత ఆరోగ్యవంతంగా.. కూడా తయారు చేసుకోవచ్చు. ఎగ్ దోశను మరింత ఆరోగ్యవంతంగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటేబుల్ ఎగ్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
దోశ పిండి – రెండు కప్పులు, ఎగ్స్ – 2, క్యారెట్ తురుము – అర కప్పు, సన్నగా తరిగిన బీన్స్ – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, టమాటా సాస్ -3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, నూనె – అర కప్పు.
వెజిటేబుల్ ఎగ్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఎగ్స్ ను పగలకొట్టి వేసి అందులో దోశ పిండి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పడు కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుని పెనం మీద దోశలా వేసుకోవాలి. దీనిపై కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కావల్సిన పరిమాణంలో తీసుకుని దోశపై ఆమ్లెట్ లా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచి దోశను మరో వైపుకు తిప్పి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ దోశ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా ఎటువంటి చట్నీతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.