Gulkand : గుల్ కంద్.. దీనినే రోస్ జామ్ అని కూడా అంటారు. గులాబి రేకులతో చేసే ఈ తీపి వంటకాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది చక్కటి వాసనతో పాటు చక్కటి రుచిని కూడా కలిగి ఉంటుంది. మనకు ఆన్ లైన్ లో, డ్రై ఫ్రూట్ షాపుల్లో ఇది సులభంగా లభిస్తుంది. ఈ గుల్ కంద్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. స్త్రీలల్లో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గుల్ కంద్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే గుల్ కంద్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుల్ కంద్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నాటు గులాబి రేకులు – 2 కప్పులు, పంచదార పొడి – ఒక కప్పు, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీస్పూన్.
గుల్ కంద్ తయారీ విధానం..
ముందుగా గులాబి రేకులను శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని తడి పోయే వరకు ఆరబెట్టాలి. ఇప్పుడు ఈ గులాబి రేకులను ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసం, యాలకుల పొడి, పంచదార పొడి వేసి స్పూన్ తో కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచాలి. ఈ గాజు సీసాను రోజూ ఇంట్లో ఎండ తగిలే చోట ఉంచాలి. అలాగే రోజూ మూత తీసి శుభ్రమైన స్పూన్ తో కలుపుతూ ఉండాలి. ఇలా రెండు వారాల పాటు చేయడం వల్ల జామ్ వంటి రుచికరమైన గుల్ కంద్ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న గుల్ కంద్ ను ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవచ్చు. దీనిని నేరుగా ఇలాగే తినవచ్చు. అదే విధంగా స్వీట్ ల తయారీలో వాడుకోవచ్చు. దీనితో షర్బత్ లను కూడా తయారు చేసుకుని తాగవచ్చు. ఈ విధంగా గుల్ కంద్ ను తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.