Home Made Pasta : పాస్తా.. ఇది మనందరికి తెలిసిందే. దీనితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. పిల్లలు దీనిని మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. సాధారణంగా ఈ పాస్తాను మనం బయట మార్కెట్ లో కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే ఈ బయట కొనే పాస్తాను మైదాపిండి, కార్న్ ఫ్లోర్ వంటి వాటితో తయారు చేస్తారు. ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలా బయట లభించే పాస్తాను కొనడానికి బదులుగా మనం ఇంట్లోనే పాస్తాను తయారు చేసుకోవచ్చు. అది కూడా గోధుమపిండితో చాలా సులభంగా పాస్తాను తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసే ఈ పాస్తాను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. గోధుమపిండితో పాస్తాను ఎలా తయారు చేసుకోవాలి.. అలగే ఇలా తయారు చేసిన పాస్తాతో మరలా పాస్తా వంటకం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోమ్ మేడ్ గోధుమపిండి పాస్తా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, నీళ్లు – 3 కప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ- 1, క్యాబేజి తురుము – పావు కప్పు, క్యారెట్ తురుము – పావు కప్పు, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1, తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – పావు కప్పు, తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, టమాట సాస్ – ఒక టేబుల్ స్పూన్, పాస్తా సాస్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ లేదా కొత్తిమీర – కొద్దిగా.
హోమ్ మేడ్ గోధుమపిండి పాస్తా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై నూనె రాసి మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత పిండిని మరో 2 నిమిషాల పాటు బాగాకలుపుకుని కొద్దిగా పిండిని తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ఇది మరీ మందంగా మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత ఈ చపాతీని చతురస్రాకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక్కో ముక్కను తీసుకుని మనకుకావల్సిన ఆకారంలో వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి ఒక దానికి ఒకటి అంటుకోకుండా ఉంచాలి.
వీటిని 15 నిమిషాలపాటు గాలికి ఆరబెట్టిన తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక పాస్తాను వేసి ఉడికించాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు ఉడికించి జల్లిగిన్నెలోకి తీసుకోవాలి. తరువాత చల్లటి నీటితో కడిగి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజి తురుము. క్యారెట్, బీన్స్, క్యాప్సికం వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాతటమాట ముక్కలు వేసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత పాస్తా వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట సాస్, పాస్తా సాస్ వేసి కలపాలి.
తరువాత మరో నిమిషం పాటు వేయించిన తరువాత స్ప్రింగ్ ఆనియన్స్ ను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాస్తా తయారవుతుంది. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా దీనిని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా గోధుమపిండితో పాస్తాను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే ఈ పాస్తాను మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. గోధుమపిండితో పాస్తాను తయారు చేసిన తరువాత దానిని ఒక రోజు లేదా రెండు రోజుల పాటు ఎండలో బాగాఎండబెట్టాలి. తరువాత వీటిని మూత ఉండే డబ్బాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాస్తా నిల్వ ఉంటుంది.