సూర్యుడు భగ భగ మండే అగ్ని గోళం. అందువల్ల సూర్యుడి వద్దకు ఏ జీవి కూడా వెళ్లలేదు. ఆ వాతావరణంలోనే కొన్ని లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అందువల్ల అక్కడికి కూడా వెళ్లలేరు. అయితే కాసేపు మనిషికి మరణం ఉండదని.. అంతరిక్షంలో నడవగలడని.. అనుకుందాం. అలాంటి స్థితిలో మనిషి నడక ప్రారంభిస్తే.. భూమి నుంచి సూర్యున్ని చేరుకునేందుకు ఎన్నేళ్ల సమయం పడుతుందో తెలుసా ? అవే వివరాలను ఒక్కసారి లెక్కిస్తే..
భూమి నుంచి సూర్యునికి ఉన్న దూరం దాదాపుగా 9,30,00,000 మైళ్లు (9.30 కోట్ల మైళ్లు). గంటకు 3 మైళ్ల వేగంతో నడిస్తే 20 నిమిషాల్లో ఒక మైలు దూరం నడవొచ్చు. అంటే సూర్యుని వద్దకు చేరేందుకు 9.30 కోట్ల మైళ్ల దూరం నడవాలి. ఒక మైలు నడిచేందుకు 20 నిమిషాలు పడితే 9.30 కోట్ల మైళ్ల దూరం నడిచేందుకు 186 కోట్ల నిమిషాల సమయం పడుతుంది. అది 3.10 కోట్ల గంటకు సమానం. అంటే 12,91,667 రోజులు. దాన్ని 365తో భాగిస్తే సుమారుగా 3539 అవుతుంది. అంటే భూమి నుంచి సూర్యుడి వరకు నడిస్తే అక్కడికి చేరుకునేందుకు 3,539 ఏళ్లు పడుతుందన్నమాట.
రోజుకు 24 గంటల పాటు నడిస్తే సూర్యుని వద్దకు చేరుకునేందుకు 3,539 ఏళ్ల సమయం పడుతుంది. అదే రోజుకు 12 గంటలే నడిస్తే 7,000 ఏళ్లు పడుతుంది. కానీ నిజంగా.. ఎవరికీ అది సాధ్యం కాదు కదా. అయినప్పటికీ ఒక వేళ ఆ శక్తే మనిషికి ఉంటే భూమి నుంచి సూర్యుని వరకు నడిచి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుంది ? అని ఉజ్జాయింపుగా వేసి లెక్క మాత్రమే..! భలే వింతగా ఉంది కదా..!