Ghee : పాలతో తయారు చేసే పదార్థాల్లో నెయ్యి కూడా ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. నెయ్యితో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే వివిధ కూరల తయారీలో కూడా ఈ నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటాం. రోటి పచ్చళ్లతో అలాగే ఆవకాయ వంటి ఊరగాయలను నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. నెయ్యిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు చేరి అధిక బరువు బారిన పడతారని చాలా మంది దీనిని తీసుకోవడమే మానేస్తున్నారు. కానీ నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిని ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. అలాగే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.
గాయాలు త్వరగా మానేలా చేయడంలో కూడా ననెయ్యి మనకు సహాయపడుతుంది. నెయ్యిలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు నెయ్యిని ఆహారంగా తీసుకుంటే ఎంతోమేలు కలుగుతుంది. దీనిని ప్రతిరోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎటువంటి హాని కలగదు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది బయట మార్కెట్ లో దొరికే వివిధ కంపెనీల నెయ్యిని కొనుగోలు చేసి వాడుతున్నారు. బయట లభించే ఈ నెయ్యి స్వచ్ఛమైనదో కాదో కూడా తెలియని పరిస్థితి మనది. కల్తీ నెయ్యిని వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చిక్కటి గేదె పాలు అలాగే కొద్దిగా ఓపిక ఉండాలే కానీ నెయ్యిని చాలా సులభంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పాల నుండి నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యిని తయారు చేసుకోవడానికి మనం చిక్కటి పాలను తీసుకోవాలి. ఈ పాలను కాచీ చల్లార్చిన తరువాత వీటిని ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాల మీద మీగడ ఎక్కువగా తయారవుతుంది. తరువాత ఈ పాలను కాచి తోడు పెట్టి పెరుగుగా చేసుకోవాలి. ఈ పెరుగును కూడా మరలా ఫ్రిజ్ లో ఉంచాలి. పెరుగును ఫ్రిజ్ లో ఉంచడం వల్ల మీగడ ఎక్కువగా తయావుతుంది. ఇలా పెరుగు మీద తయారైన మీగడనంతా సేకరించి ఒక గిన్నెలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా వారం నుండి పది రోజుల పాటు సేకరించిన మీగడనంతా ఒక గిన్నెలోకి తీసుకుని చల్లదనం పోయే వరకు బయట ఉంచాలి.
ఈ మీగడ నుండి వెన్న తీయడానికి రకరకాల పద్దతులను ఉపయోగించవచ్చు. ఈ మీగడను జార్ లో వేసి మిక్సీ పట్టుకున్నా లేదా కవ్వంతో తిప్పిన లేదా ఒక డబ్బాలో వేసి బాగా ఊపిన కూడా వెన్న వస్తుంది. ఈ మీగడలో కొద్దిగా నీటిని పోసి వెన్నను ఒక గిన్నెలోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి రెండు నుండి మూడు సార్లు బాగా కడగాలి.తరువాత ఈ వెన్న గిన్నెను స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. ఈ వెన్నను చిన్న మంటపై కలుపుతూ వేడి చేయాలి. కొద్ది సేపటి తరువాత వెన్న కరిగి రంగు మారుతూ నెయ్యిలా తయారవుతుంది. ఈ నెయ్యి గోధుమ రంగులోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఇందులో 4 నుండి 5 మెంతి గింజలను కాపీ ఒక తమలపాకును కానీ వేయాలి. ఇలా వేయడం వల్ల నెయ్యి కమ్మటి వాసన వస్తుంది.
ఈ నెయ్యి కొద్దిగా చల్లారిన తరువాత దీనిని వడకట్టి ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఈ నెయ్యి పూర్తిగా చల్లారిన తరువాత గట్టిగా పూస పూసగా తయారవుతుంది. ఇలా చేయడం వల్ల కమ్మటి వాసనతో చక్కటి రుచిని కలిగి ఉండే నెయ్యి తయారవుతుంది. ఈ నెయ్యిని ఫ్రిజ్ లో ఉంచకపోయినా కూడా చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యిని ఆహారంగా తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. నెయ్యిని తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి మేలే తప్ప హాని కలగదని నిపుణులు చెబుతున్నారు.