Oats Dosa : సాధారణంగా మనం ఇడ్లీలు, దోశలు వంటి టిఫిన్స్‌ను తరచూ తింటుంటాం. వీటి తయారీలో మనం బియ్యం పిండి వాడుతాం. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మనం బియ్యం పిండికి బదులుగా తృణ ధాన్యాలు లేదా చిరుధాన్యాలతో తయారు చేసిన టిఫిన్లను తినాలని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే మనం అలాంటి ఆరోగ్యకరమైన టిఫిన్లను తయారు చేసుకుని తినాల్సి ఉంటుంది. ఇక అలాంటి ఆరోగ్యకరమైన టిఫిన్లలో ఓట్స్ దోశ కూడా ఒకటి. వీటిని తయారు చేయడం ఎంతో సులభం. అందరూ ఇష్టంగా తింటారు. ఓట్స్ దోశల తయారీకి ఏమేం కావాలో, వీటిని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ – అర కప్పు, బియ్యం పిండి – అర కప్పు, జీలకర్ర – 1 టీస్పూన్, బొంబాయి రవ్వ – పావు కప్పు, పెరుగు – అర కప్పు, అల్లం తురుము – 1 టీస్పూన్, పచ్చి మిర్చి తురుము – 2 టీస్పూన్లు, మిరియాల పొడి – అర టీస్పూన్, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – 3 కప్పులు, నూనె – వేయించడానికి సరిపడా.
ఓట్స్‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి. తరువాత దానికి బియ్యం పిండి, రవ్వ, పెరుగు జోడించి కలపాలి. తరువాత జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తురుము, కొత్తిమీర తురుము, మిరియాల పొడి, ఉల్లిముక్కలు, ఉప్పు అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు మంచినీళ్లు పోసి కలిపి ఓ 20 నిమిషాలు నానబెట్టాలి. పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాసి పిండి మిశ్రమాన్ని గరిటెతో రవ్వ దోశ మాదిరిగానే వేయాలి. బాగా కాలిన తరువాత రెండో వైపున కూడా కాల్చి తీసి ఇష్టమైన చట్నీ లేదా కూరతో తినాలి. ఇలా ఓట్స్ దోశలను తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.