Chilli Chicken : మాంసాహార ప్రియులు అందరికీ చికెన్ అంటే ఇష్టంగానే ఉంటుంది. దీన్ని తినని వారు ఉండరు. ఈ క్రమంలోనే చికెన్‌తో మనం అనేక రకాల వంటలను చేసి తింటుంటాం. అయితే చికెన్‌తో చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌ను కూడా చేయవచ్చు. వాటిల్లో చిల్లీ చికెన్ ఒకటి. ఇది మనకు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, రెస్టారెంట్లలో లభిస్తుంది. కానీ దీన్ని కాస్త శ్రమిస్తే మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇక చిల్లీ చికెన్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిల్లీ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్‌లెస్ చికెన్ – 500 గ్రాములు, సోయాసాస్ – 1 టీస్పూన్, కోడిగుడ్డు – 1, మొక్కజొన్న పిండి – 2 టీస్పూన్లు, పచ్చి మిరపకాయలు – 5, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉల్లిపాయ పేస్ట్ – 3 టీస్పూన్లు, మిరియాల పొడి – అర టీస్పూన్, చక్కెర – 1 టీస్పూన్, నీరు – 2 కప్పులు, నూనె – తగినంత.
చిల్లీ చికెన్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో చికెన్ ముక్కలు వేయాలి. వాటిపై సగం సోయా సాస్, మొక్కజొన్నపిండి, గుడ్డు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంపై మూత పెట్టి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో మారినేట్ చేయబడిన చికెన్ ముక్కలను బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం మరొక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి సన్నగా కట్ చేసిన పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అనంతరం అందులో నీరు పోసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు చక్కెర, మిరియాల పొడి, ఉప్పు, మిగిలిన సోయా సాస్ వేయాలి. తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి కలపాలి. మొత్తం నీరంతా ఆవిరైపోయే వరకు బాగా వేయించాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి దించాలి. అంతే.. చిల్లీ చికెన్ తయారవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.