Blood Stains On Clothes : మనం ఎలాంటి దుస్తులను ధరించినా సరే వాటిపై చిన్న మరకపడినా విలవిలలాడిపోతాం. ఇక ఖరీదైన దుస్తులపై మరకలు పడితే మన ప్రాణాలు పోయినట్లు అవుతుంది. అంత రేటు పెట్టి కొన్న డ్రెస్‌పై ఏదైనా మరక పడితే మనకు మనసులో అంతా ఆందోళనగా ఉంటుంది. ఆ మరకను పోగొట్టే వరకు మనకు నిద్ర పట్టదు. ఈ క్రమంలోనే మన దుస్తులపై రోజూ భిన్న రకాల మరకలు పడుతుంటాయి. అయితే వాటిల్లో రక్తపు మరకలు కూడా ఒకటి. ఇవి ఒక పట్టాన పోవు. కానీ కింద తెలిపిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల రక్తపు మరకలను కూడా దుస్తుల మీద నుంచి సులభంగా పోగొట్టవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దుస్తులపై రక్తపు మరక పడిన వెంటనే నీళ్లు పెట్టి కడిగేయాలి. దీంతో చాలా వరకు మరక అప్పుడే పోతుంది. ఆ తరువాత వేరే ఏదైనా చిట్కాతో ఆ మిగిలిన మరకను కూడా తొలగించవచ్చు. అయితే నీళ్లతో పెట్టి కడిగేంత వీలు కుదరకపోతే అప్పుడు ఇతర చిట్కాలను పాటించాలి. ఇక రక్తపు మరకలు పడిన దుస్తులను ఎట్టి పరిస్థితిలోనూ చల్లని నీళ్లతోనే ఉతకాలి. వేడి నీళ్లను వాడరాదు. చల్లని నీళ్లను వాడితే మరక త్వరగా పోతుంది.
రక్తపు మరకలను తొలగించేందుకు మార్కెట్‌లో మనకు భిన్న రకాల స్టెయిన్ రిమూవర్‌లు లభిస్తున్నాయి. వీటిని వాడితే తప్పక ఫలితం ఉంటుంది. అలాగే రక్తపు మరకలను తొలగించేందుకు బేకింగ్ సోడా కూడా బాగానే పనిచేస్తుంది. ఇందుకు గాను రెండు వంతుల బేకింగ్ సోడా, ఒక వంతు నీళ్లను తీసుకుని కలిపి పేస్ట్ లా చేయాలి. దీన్ని మరకపై రాయాలి. 30 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తే ఎలాంటి రక్తపు మరకలు అయినా సరే పోతాయి.
ఇక ఈ మరకలను పోగొట్టేందుకు మరో చిట్కా కూడా పనిచేస్తుంది. అదేమిటంటే.. గాయాలను కడిగేందుకు ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని నేరుగా రక్తపు మరకపై రాయాలి. దీంతో మరక పోతుంది. వెంటనే కడిగేయాలి. అయితే మొండి మరక అయితే మరిన్ని సార్లు ఇలా ట్రై చేయవచ్చు. దీంతో మరకలు పోతాయి. ఇక దుస్తుల రకాన్ని బట్టి కూడా మరకలు ఉంటాయి. కనుక దుస్తులకు అనుగుణంగా ఆయా చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే దుస్తులు పాడయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్తలు అవసరం.