How To Store Jaggery : బెల్లం తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ప్రతి సీజన్‌లోనూ తప్పక బెల్లం తినాలని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తుంటారు. బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. కనుక బెల్లంను రోజూ తినాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అయితే బెల్లం దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. కానీ దీన్ని వర్షాకాలంలో నిల్వ చేయడం చాలా కష్టం అనే చెప్పవచ్చు.
వర్షాకాలంలో తేమ అధికంగా ఉంటుంది కనుక బెల్లం బాగా ముద్దగా అయిపోతుంది. అలా మారిన బెల్లాన్ని వాడడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక బెల్లం ఇలా మారడం వల్ల ఫంగస్ చేరి త్వరగా పాడైపోతుంది. ఇలా వర్షాకాలంలో బెల్లంను నిల్వ చేయడంలో మనకు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే కింద తెలిపిన విధంగా మూడు చిట్కాలను పాటిస్తే.. దాంతో బెల్లం ఎప్పటికీ పాడవకుండా నిల్వ చేసుకోవచ్చు. మరి ఆ మూడు చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
బెల్లంను నిల్వ చేసేందుకు జిప్ లాక్ బ్యాగ్‌ను ఉపయోగించవచ్చు. పేపర్ టవల్‌లో బెల్లాన్ని చుట్టి అనంతరం దాన్ని జిప్ లాక్ బ్యాగ్‌లో వేసి జిప్ పెట్టాలి. గాలి చొరబడకుండా చూడాలి. ఇలా చేస్తే బెల్లం ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే వర్షాకాలంలో ముద్దగా కూడా మారదు. అయితే పేపర్ టవల్ లేకపోతే నేరుగా జిప్ లాక్ బ్యాగ్‌లోనే బెల్లాన్ని అలాగే పెట్టవచ్చు. ఇలా కూడా బెల్లాన్ని స్టోర్ చేయవచ్చు. ఇక జిప్ లాక్ బ్యాగ్ లేకపోతే ఏదైనా పాలిథీన్ కవర్‌లో చుట్టి అనంతరం దాన్ని గాలి చొరబడని డబ్బాలో పెట్టి మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా బెల్లం నిల్వ ఉంటుంది.
బెల్లాన్ని మనం ఫ్రిజ్‌లోనూ నిల్వ చేయవచ్చు. అయితే ఇందుకు గాను ప్లాస్టిక్ డబ్బాలను వాడాల్సి ఉంటుంది. అందులో తేమ లేకుండా చూసి బెల్లాన్ని పెట్టాలి. అనంతరం ఆ డబ్బా మూత గట్టిగా బిగించాలి. తరువాత దాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి. దీంతో బెల్లం నిల్వ ఉంటుంది. అయితే బెల్లాన్ని ఫ్రిజ్‌లో పెట్టేందుకు ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ డబ్బాలను వాడరాదు. అవి తేమను గ్రహిస్తాయి. దీంతో బెల్లం తేమగా మారుతుంది. కనుక ఇందుకు ప్లాస్టిక్ డబ్బాలనే వాడాలి.
ఇక బెల్లాన్ని నిల్వ చేసేందుకు ఎండిపోయిన ఆకులు కూడా పనిచేస్తాయి. ఇందుకు గాను ముందుగా కొన్ని ఎండిన ఆకులను డబ్బాలో వేయాలి. తరువాత వాటిపై బెల్లం వేయాలి. అనంతరం మూత పెట్టేయాలి. ఇలా బెల్లాన్ని నిల్వ చేయవచ్చు. ఇలా ఈ మూడు విధాలుగా బెల్లాన్ని నిల్వ చేస్తే 6 నెలల వరకు పాడవకుండా తాజాగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. వర్షాకాలంలో సైతం బెల్లం పొడిగా ముద్దగా లేకుండా ఉంటుంది.