Capsicum Kurma : క్యాప్సికం కుర్మా.. క్యాప్సికంతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ వంటి వాటిలోకి తినడానికి ఈ కూర చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. వివిధ రకాల వంటకాల్లో వాడడంతో పాటు క్యాప్సికంతో ఇలా రుచిగా కుర్మాను కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో క్యాప్సికం ఉంటే చాలు ఈ కూరను 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే క్యాప్సికం కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, కర్జూజ గింజలు – 2 టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి పొడి – పావు కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 2, నూనె – పావు కప్పు, పెద్ద ముక్కలుగా తరిగిన క్యాప్సికం – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, పసుపు – 2 చిటికెలు, ఉప్పు – తగినంత, టమాటాలు – 2, నీళ్లు – 300 ఎమ్ ఎల్, కారం – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి- ఒక టేబుల్ స్పూన్.
క్యాప్సికం కుర్మా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో జీడిపప్పు, కర్జూజ గింజలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. ఇవి సగానికి పైగా వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.
వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, నీళ్లు, కారం, వేయించిన క్యాప్సికం ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం కుర్మా తయారవుతుంది. దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.