Hyderabadi Biryani Masala : మనలో చాలా మంది బిర్యానీని ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు బయట కూడా ఎంతో రుచిగా ఉండే బిర్యానీ దొరుకుతుంది. చాలా మంది దీనిని ఇంట్లో కూడా తయారు చేస్తారు. అయితే హైదరాబాదీ బిర్యానీ కి ఉండే రుచే వేరు. అందుకు కారణం ఆ బిర్యానీలో వేసే మసాలానే అని చెప్పవచ్చు. మనకు మార్కెట్ లో హైదరాబాదీ బిర్యానీ మసాలా పౌడర్ దొరుకుతున్నప్పటికీ దాంతో చేసే బిర్యానీ అంత రుచిగా ఉండదు. ఈ బిర్యానీ మసాలాను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బిర్యానీకే చక్కని రుచిని తెచ్చే ఈ మసాలాను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదీ బిర్యానీ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
నల్ల యాలకులు – 2, మరాఠీ మొగ్గలు – 2, దాల్చిన చెక్క ముక్కలు – 2 ( రెండు ఇంచులు ఉన్నవి), జాజికాయ – అర ముక్క, అనాస పువ్వులు – 3, యాలకులు – 10, లవంగాలు – 15, జాపత్రి – 2, మిరియాలు – ఒక టీ స్పూన్, ధనియాలు – పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, ముక్కలుగా చేసిన బిర్యానీ ఆకులు – 2 (పెద్దవి).
హైదరాబాదీ బిర్యానీ మసాలా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నల్ల యాలకులు, మరాఠీ మొగ్గ, జాజికాయ, అనాస పువ్వులు, యాలకులు, జాపత్రి, ధనియాలు వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత బిర్యానీ ఆకులు తప్ప మిగిలిన పదార్థాలు వేసి మరో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకులను కూడా వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పడు ఒక జార్ ని తీసుకుని అది తడి లేకుండా చేసి అందులో వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నింటినీ వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కని వాసనతో కూడిన బిర్యానీ మసాలా తయారవుతుంది. దీనిని మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం వరకు మసాలా వాసన పోకుండా తాజాగా ఉంటుంది. బిర్యానీ తయారీలోనే కాకుండా చికెన్, మటన్ వంటి నానె వెజ్ వంటకాలలోనూ దీనిని ఉపయోగించవచ్చు. ఇలా తయారు చేసుకున్న బిర్యానీ మసాలాను ఉపయోగించడం వల్ల చక్కని రుచితో ఉండే బిర్యానీ తయారవుతుంది.