Ice Cream Without Sugar : ఐస్ క్రీమ్.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు దీనిని ఇష్టంగా తింటారు. ఐస్ క్రీమ్ మనకు వివిధ రుచుల్లో లభిస్తూ ఉంటుంది. అయితే దీనిని తయారు చేయడానికి ఎక్కువగా పంచదారను అలాగే రంగులను వాడుతూ ఉంటారు. ఇలా తయారు చేసిన ఐస్ క్రీమ్ ను తినడం వల్ల రుచిగా ఉన్నప్పటికి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎటువంటి రంగులను వాడకుండా, అలాగే పంచదారను ఉపయోగించకుండా కూడా మనం రుచికరమైన ఐస్ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసే ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. పంచదార ఉపయోగించకుండా కమ్మటి, చల్ల చల్లని ఐస్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్ క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – అర లీటర్, ఖర్జూర పండ్లు – 25, జీడిపప్పు పలుకులు – 12, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, యాలకులు – 3.
ఐస్ క్రీమ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు పాలను తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్ ను వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో గింజలు తీసేసిన ఖర్జూర పండ్లు, జీడిపప్పును తీసుకోవాలి. తరువాత ఇవి మునిగే వరకు వేడి పాలను పోసి మూత పెట్టి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. మిగిలిన పాలను కళాయిలో పోసి మరిగించాలి. వీటిని మీగడ కట్టకుండా ఒక పొంగు వచ్చే వరకు మరిగించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న కార్న్ ఫ్లోర్ పాలను పోసి కలపాలి. ఈ పాలను కలుపుతూ 2 నుండి 3 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ముందుగా నానబెట్టిన ఖర్జూర పండ్లను పాలతో సహా ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే యాలకులను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత కార్న్ ఫ్లోర్ పాలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గాజు గిన్నెలోకి లేదా స్టీల్ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిపై సిల్వర్ పాయిల్ ను ఉంచిమూత పెట్టి 7 నుండి 10 గంటల పాటు డీ ఫ్రిజ్ లో ఉంచాలి. ఐస్ క్రీమ్ గడ్డకట్టిన తరువాత బయటకు తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఐస్ క్రీమ్ తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వేసవికాలంలో ఇలా ఐస్ క్రీమ్ ను తయారు చేసుకుని తినడం వల్ల మనం ఆరోగ్యంతో పాటు ఎండ నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు.