Sugar Palm Fruit Milkshake : వేసవి కాలంలో మనకు సహజంగానే తాటి ముంజలు ఎక్కువగా లభిస్తుంటాయి. ఇవి ఈ సీజన్‌లోనే లభిస్తాయి. రహదారుల పక్కన వీటిని ఎక్కువగా విక్రయిస్తుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు ముంజలు ఎక్కువగా ఎక్కడంటే అక్కడ లభిస్తాయి. అయితే ముంజలను నేరుగా తినడమే కాదు.. వాటితో ఎంతో రుచిగా ఉండే మిల్క్ షేక్‌ను సైతం తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో చల్లగా ఉంటుంది. వేడి మొత్తం తగ్గిస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తాటి ముంజల మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత ముంజలు – నాలుగు, కాచి చల్లార్చిన పాలు – ఒక గ్లాస్, చక్కెర – పావు కప్పు, యాలకుల పొడి – పావు టీస్పూన్, సబ్జా గింజలు – రెండు టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ తరుగు – ఒక టీస్పూన్.
తాటి ముంజల మిల్క్ షేక్‌ను తయారు చేసే విధానం..
సబ్జా గింజలను అరగంట పాటు నీళ్లలో నానబెట్టాలి. ముంజలను కూడా చల్లని నీళ్లలో కాసేపు ఉంచి శుభ్రంగా పొట్టు తీసి మిక్సీలో వేసుకోవాలి. దీంట్లో కాచి చల్లార్చిన పాలను పోసి చక్కెర, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెద్ద గిన్నెలో నోసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. కాసేపటి తరువాత గ్లాసుల్లో పోసి సబ్జా గింజలు వేసి కలపాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ తరుగుతో గార్నిష్ చేసుకుని చల్ల చల్లగా తాగితే చాలా రుచిగా ఉంటుంది.