Idli Pindi Atlu : మనం ఇడ్లీలను తయారు చేసుకోగ మిగిలిన పిండితో ఎక్కువగా బోండాలను తయారు చేస్తూ ఉంటాం. కేవలం బోండాలే కాకుండా ఈ ఇడ్లీ పిండితో మనం ఎంతో రుచిగా ఉండే అట్టును కూడా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ పిండితో చేసే అట్టు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఇడ్లీ పిండితో రుచిగా, సులభంగా అట్టును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీ పిండి – 3 కప్పులు, మైదాపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, నీళ్లు – 2 కప్పులు లేదా తగినన్ని.
అట్టు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిపై మూతను ఉంచి ఒక గంట పాటు నానబెట్టాలి. పిండి చక్కగా నానిన తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి టిష్యూ పపర్ తో లేదా కాటన్ వస్త్రంతో తుడుచుకోవాలి. తరువాత తగినంత పిండిని తీసుకుని అట్టులా వేసుకోవాలి. అట్టు మరీ మందంగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత దీనిపై నూనె వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అట్టు తయారవుతుంది. దీనిని పల్లి చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ పిండి తక్కువగా ఉన్నప్పుడు లేదా పిండి బాగా పులిసినప్పుడు ఇలా అట్టును తయారు చేసుకుని తినవచ్చు. ఈ అట్టును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.