Instant Dosa : మనం ఉదయం పూట అల్పాహారంగా తీసుకునే వాటిల్లో దోశలు కూడా ఒకటి. దోశలను చాలా మంది ఇష్టంగా తింటారు. దోశలు తినడానికి రుచిగా ఉన్నప్పటికీ దోశ పిండిని తయారు చేయడం మాత్రం కొద్దిగా శ్రమతో, సమయంతో కూడిన పని అని చెప్పవచ్చు. దోశ పిండిని తయారు చేసుకునే సమయం కూడా అందరికీ ఉండి ఉండదు. అలాంటి వారు కేవలం 15 నిమిషాల్లోనే ఎలాంటి శ్రమ లేకుండా ఎంతో రుచిగా ఉండే దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఇన్ స్టాంట్ గా దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ముప్పావు కప్పు, గోధుమ పిండి – అర కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, పెరుగు – అర కప్పు, నీళ్లు – తగినన్ని, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్.
ఇన్ స్టాంట్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో బొంబాయి రవ్వ వేసి మెత్తగా మిక్సీ పట్టు కోవాలి. తరువాత అందులోనే గోధుమ పిండి, బియ్యం పిండి, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే తగినన్ని నీళ్లను కూడా పోసి దోశ పిండిలా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ పిండి గిన్నెపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి.
దోశ కొద్దిగా కాలిన తరువాత నూనె వేసి రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోశలను కేవలం 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ దోశలను పల్లిచట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న దోశ పిండితో మామూలు దోశలతోపాటు ఉల్లి దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పప్పును నాబెట్టే పనిలేకుండా అప్పటికప్పుడు ఎంతో రుచిగా దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా చేసిన దోశలు కూడా చాలా రుచిగా ఉంటాయి.