ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించుకునేందుకు చాలా మంది ఎంతో కృషి చేస్తుంటారు. ఇంటర్వ్యూకి వెళ్లేముందు చాలా ప్రిపేర్డ్ గా కూడా వెళుతుంటారు. ఎలా అయిన జాబ్ కొట్టాలని, లైఫ్‌లో సెటిల్ అయిపోవాలని ఎన్నో కలలు కంటుంటారు. అయితే ఒక్కోసారి ఊహించని విధంగా ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో వారిలో కలిగే చిరాకు, అసహనం అంతా ఆంతా కాదు. తాజాగా ఇంటర్వ్యూల్లో ప్రతిభకు సంబంధించిన ప్రశ్నలు.. నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.
ఓ ఐటీ ఉద్యోగం కోసం ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన యువతికి విచిత్ర సంఘటన ఎదురైంది. ఆ యువతికి జావా, సీఎస్ఎస్, యాంగులర్, హెచ్‌టీఎంఎల్ వంటి కోడింగ్ లాంగ్వేజెస్‌లో పదేళ్ల అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి దగ్గరే ఉన్న కంపెనీలో ఉద్యోగానికి వెళ్లింది. అక్కడ ఆ యువతికి విచిత్ర సంఘటన ఎదురైంది. సీఎస్ఎస్ కోడింగ్‌లో జాతీయ జెండాను గీసి చూపించాలని ఇంటర్వ్యూలో అడిగారట. తనకున్న అనుభవంతో గీసి చూపించింది. ఆ తర్వాత అశోక చక్రంను వేసి చూపించమన్నారట. అది కూడా వేసింది. ఆ అశోక చక్రంలో ఉండే గీతలు మిస్సయ్యాయని.. వాటిని కూడా వేయాలని చెప్పారట. ఇంత వరకు జాతీయ జెండాను గీసిన ఆ యువతి గీతలు మిస్సయ్యాయి అనగానే ఇదేం చెత్త కంపెనీ.. ఇలాంటివా అడిగేది.. అంటే ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయిందట.
ఈ విషయాన్ని సదరు యువతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ ఆ అమ్మాయి ఏదో ఊహించి చేయగా, ఆమెకి ప్రశంసల కన్నా తిట్లే ఎక్కువగా పడ్డాయి ఆ అమ్మాయికి. ఒక జాతీయ జెండాను గీసే సత్తా లేక ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయింది గాక మళ్లీ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు పోస్ట్ పెడతావా అంటూ నెటిజన్లు ట్రోల్ చేసారు. ఏది ఏమైన కూడా ఇప్పుడు ఆ అమ్మాయి పోస్ట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.