IPL 2022 Captains : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ వచ్చేసింది. ఇంకో రెండు నెలల పాటు క్రికెట్ వీక్షకులకు కావల్సినంత వినోదం లభించనుంది. ఈ క్రమంలోనే ఈసారి టోర్నీలో రెండు కొత్త జట్లు చేరాయి. లక్నో సూపర్ జియాంట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. దీంతో లీగ్ మరింత ఆసక్తికరంగా మారనుంది. మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో మరింత ఎక్కువ క్రికెట్ వినోదం ప్రేక్షకులకు లభ్యం కానుంది.
ఇక ఈసారి అన్ని జట్లలోనూ అనేక మార్పులు జరిగాయి. చాలా మంది ప్లేయర్లు మారిపోయారు. కొందరు కెప్టెన్లుగా దిగిపోయారు. దీంతో అన్ని జట్లు దాదాపుగా కొత్త ప్లేయర్లు, కొత్త కెప్టెన్‌లతో కళకళలాడుతున్నాయి. ఇక ఈసారి పోటీ పడుతున్న 10 జట్లకు చెందిన కెప్టెన్ల వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు కెప్టెన్‌గా ధోనీ ఈసారి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో రవీంద్ర జడేజా చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా తప్పుకోగా.. అతని స్థానంలో డుప్లెసిస్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టును శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా లీడ్ చేయనున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ (ఎంఐ) కెప్టెన్ మారలేదు. దీంతో రోహిత్ శర్మనే ఈసారి కూడా కెప్టెన్‌గా పనిచేయనున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ పనిచేస్తాడు. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌కు బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ఇంకో కొత్త జట్టు లక్నో సూపర్ జియాంట్స్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహిస్తున్నాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు సంజు శాంసన్ కెప్టెన్‌గా పనిచేయనున్నాడు. ఈ క్రమంలో ఈసారి 2 కొత్త జట్లు చేరడంతో పోటీ పెరగనుంది. దీని వల్ల క్రికెట్ ప్రేమికులకు మరింత వినోదం లభ్యం కానుంది.