Jaggery Halwa : బెల్లంతో చాలా సుల‌భంగా చేయ‌గ‌లిగే హ‌ల్వా.. రుచి భ‌లేగా ఉంటుంది..

Jaggery Halwa : తీపి ప‌దార్థాల‌ను ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. మ‌నకు బ‌య‌ట దొర‌క‌డంతోపాటు ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే తీపి వంట‌కాల్లో హ‌ల్వా కూడా ఒక‌టి. హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే హ‌ల్వాను త‌యారు చేయ‌డానికి మ‌నం ఎక్కువ‌గా పంచ‌దార‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం పంచ‌దార‌తోనే కాకుండా బెల్లంతో కూడా మ‌నం హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా బెల్లంతో హ‌ల్వాను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హ‌ల్వా తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదా పిండి – అర క‌ప్పు, నీళ్లు – ఒక‌ క‌ప్పు, బెల్లం తురుము – ఒక‌టి ముప్పావు క‌ప్పు, నెయ్యి – పావు కప్పు, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్, జీడి ప‌ప్పు – 2 టీ స్పూన్స్.

Jaggery Halwa very easy to make
Jaggery Halwa

హ‌ల్వా తయారీ విధానం..

ఈ తీపి వంట‌కాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గాను ముందుగా ఒక క‌ళాయిలో మైదా పిండిని వేసి చిన్న మంట‌పై కలుపుతూ వేయించుకోవాలి. మైదా పిండి మాడిపోకుండా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో అర క‌ప్పు నీళ్లను పోసి ఉండ‌లు లేకుండా ప‌లుచ‌గా క‌లుపుకుని ప‌క్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో బెల్లం తురుము, అర క‌ప్పు నీళ్లు పోసి బెల్లం క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ వేడి చేయాలి. బెల్లం క‌రిగిన త‌రువాత ఈ నీటిని ఒక‌సారి వ‌డ‌క‌ట్టుకుని మ‌ళ్లీ అదే క‌ళాయిలోకి తీసుకోవాలి.

ఇప్పుడు ఈ బెల్లం నీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై 5 నుండి 10 నిమిషాల వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఇందులో ముందుగా క‌లిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్ర‌మాన్ని వేసి రెండూ క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత ముందుగా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి క‌లుపుకోవాలి. మ‌ర‌లా 5 నిమిషాల త‌రువాత మ‌రో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఇలా నెయ్యి అంతా అయి పోయే వ‌ర‌కు 5 నిమిషాల‌కొక‌సారి నెయ్యిని వేస్తూ క‌లుపుతూ ఉండాలి.

ఇలా నెయ్యిని వేసిన త‌రువాత బెల్లం మిశ్ర‌మం క‌ళాయికి అతుక్కుపోకుండా వేరు అవుతుంది. ఆ స‌మ‌యంలో యాల‌కుల పొడిని, జీడిప‌ప‌ప్పు ప‌లుకుల‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెకు లేదా ప్లేట్ కు నెయ్యిని రాసి అందులో ముందుగా త‌యారు చేసుకున్న హ‌ల్వాను వేసి వేయాలి. స్పూన్ తో ఈ హ‌ల్వా పై భాగాన్ని స‌మానంగా చేసుకోవాలి. దీనిపై మ‌రిన్ని జీడి ప‌ప్పు ప‌లుకుల‌ను లేదా పిస్తా ప‌లుకుల‌ను వేసి కొద్దిగా లోప‌లికి వెళ్లేలా వ‌త్తాలి. ఈ హ‌ల్వా పూర్తిగా చ‌ల్లారిన ముక్క‌లుగా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం హ‌ల్వా త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన హ‌ల్వాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts