Jonna Puttu : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు ఒకటి. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుత కాలంలో వీటి వాడకం ఎక్కువయ్యిందనే చెప్పవచ్చు. జొన్నలతో రొట్టె, సంగటి, గటక, ఇడ్లీ, దోశ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవేకాకుండా జొన్నలతో మనం ఎంతో రుచిగా ఉండే జొన్న పుట్టును కూడా తయారు చేసుకోవచ్చు. దీనినే జొన్న పిట్టు అని కూడా అంటారు. పూర్వకాలం వంటకమైనా జొన్న పుట్టును మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ఆవిరి మీద ఉడికించి చేసే ఈ జొన్న పుట్టు చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న పుట్టును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న పుట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చ జొన్నలు – ఒక గ్లాస్, ఎండు కొబ్బరి పొడి – ముప్పావు కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – పావు కప్పు.
జొన్న పుట్టు తయారీ విధానం..
ముందుగా జొన్నలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వాటిని వడకట్టి జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో గిన్నెకు సగానికి నీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక పలుచటి కాటన్ వస్త్రాన్ని నీటిలో తడిపి నీళ్లు పోయేలా పిండాలి. తరువాత ఈ వస్త్రాన్ని గిన్నెపై మూతలా ఉంచి జారిపోకుండా దారంతో కట్టాలి. ఈ వస్త్రంపై మిక్సీ పట్టుకున్న జొన్న పిండిని గుట్టలాగా వేసుకోవాలి. తరువాత స్పూన్ తో మధ్య మధ్యలో రంధ్రాలు చేసుకోవాలి. ఎక్కువగా ఉన్న కాటన్ వస్త్రంతో జొన్న పిండిని మూసివేయాలి. తరువాత దీనిపై ఆవిరి పోకుండా మరో గిన్నెను ఉంచి ఉడికించాలి. ఈ విధంగా జొన్న పిండి పూర్తిగా రంగు మారి చక్కగా ఉడికే వరకు ఆవిరి మీద ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ఈ జొన్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఇందులో బెల్లం, కొబ్బరి పొడి వేసి ఉండలు లేకుండా చక్కగా కలపాలి. తరువాత తగినంత నెయ్యిని పోసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న పుట్టు తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో వీటిని స్నాక్స్ గా తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. స్త్రీలల్లో నెలసరి సమస్యలు తగ్గుతాయి. రక్తహీనత తగ్గు ముఖం పడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది.