Kadugu Charu : ఎలాంటి చింత‌పండు, ప‌ప్పులు లేకుండా చారును ఇలా చేయండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Kadugu Charu : సాధార‌ణంగా మ‌నం బియ్యం క‌డిగిన నీటిని పార‌బోస్తూ ఉంటాము. కానీ కొన్ని ప్రాంతాల్లో బియ్యం క‌డిగిన నీటితో క‌డుగు చారును త‌యారు చేస్తారు. క‌డుగు చారు చాలా రుచిగా ఉంటుంది. ప‌ప్పు, చింత‌పండు లేకుండా చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది ప‌ప్పుచారు వ‌లె చిక్క‌గా ఉండ‌దు. ఈ చార‌ను వేస‌వికాలంలో తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఈ క‌డుగు చారును త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ చారును త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌రీరానికి చ‌లువ చేసే ఈ క‌డుగు చారును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌డుగు చారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టీ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన మున‌క్కాయ – 1, త‌రిగిన చిల‌గ‌డ‌దుంప – 1, సొర‌కాయ ముక్క‌లు – కొన్ని, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన బెండ‌కాయ‌లు – 4, త‌రిగిన పుల్ల‌టి మామిడికాయ ముక్క‌లు – పులుపు త‌గిన‌న్ని, కారం – ఒక టీస్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Kadugu Charu recipe in telugu make in this method
Kadugu Charu

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టీ స్పూన్స్, మెంతి గింజ‌లు – 10, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 4, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

క‌డుగు చారు త‌యారీ విధానం..

ముందుగా ముడి బియ్యాన్ని లేదా ఇంట్లో తినే బియ్యాన్ని తీసుకుని ముందుగా వాటిలో చెత్త పోయేలా నీరు పోసి క‌డ‌గాలి. త‌రువాత చారుకు త‌గిన‌న్ని నీళ్లు పోసి బాగా క‌డ‌గాలి. ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి, మున‌క్కాయ‌, చిల‌గ‌డ దుంప‌, సొర‌కాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి మూత పెట్టి మ‌గ్గించాలి. ఇవి కొద్దిగా మ‌గ్గిన త‌రువాత ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రికొద్దిగా మ‌గ్గించాలి. త‌రువాత బెండ‌కాయ‌, మామిడికాయ ముక్క‌లు వేసి మూత పెట్టి మ‌గ్గించాలి. ముక్క‌ల‌న్నీ మెత్త‌గా మ‌గ్గిన త‌రువాత కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత బియ్యం క‌డిగిన నీళ్లు పోసి క‌లపాలి. వీటిపై మూత పెట్టి చిన్న మంట‌పై 5 నుండి 7 నిమిషాల పాటు మరిగించాలి. చారు మ‌రిగిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని చారులో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌డుగు చారు త‌యార‌వుతుంది. ఈ చారు చిక్క‌గా ఉండాల‌నుకునే వారు అన్నం వండేట‌ప్పుడు వ‌చ్చే గంజిని కూడా వేసుకోవ‌చ్చు. ఈ విధంగా క‌డుగు చారును త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts