Kakarakaya Palli Karam : కాకరకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకరకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కాకరకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కాకరకాయ పల్లికారం కూడా ఒకటి. పల్లీలు వేసి చేసే ఈ కాకరకాయ కారం చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయలను తినని వారు కూడా ఈ కారాన్ని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ కారాన్ని తయారు చేసుకోవడం చాలా తేలిక. ఎంతో కమ్మగా ఉండే ఈ కాకరకాయ పల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ పల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – పావుకిలో, పల్లీలు – 4 నుండి 5 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 12 నుండి 15, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15, నూనె – 3 నుండి 4 టేబుల్ స్పూన్స్.
కాకరకాయ పల్లి కారం తయారీ విధానం..
ముందుగా కాకరకాయలపై ఉండే చెక్కును తీసేసి గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వీటిని పది నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో వేయించిన పల్లీలతో పాటు మిగిలిన దినుసులను కూడా తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడిచేయాలి.
తరువాత కాకరకాయ ముక్కల్లో ఉండే నీటిని పిండేసి నూనెలో వేసి వేయించాలి. వీటిని ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం పొడి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పల్లికారం చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది.