Kakarakaya Pulusu : మనం కాకరకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో వేపుడు, కూర, పులుసు ఇలా రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కాకరకాయలతో చేసే పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. కాకరకాయ పులుసును చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేదు లేకుండా చాలా రుచిగా ఈ పులుసును తయారు చేసుకోవచ్చు. చేదు లేకుండా కమ్మగా కాకరకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – పావుకిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 5, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, నీళ్లు – అర గ్లాస్.
కాకరకాయ పులుసు తయారీ విధానం..
ముందుగా కాకరకాయలపై ఉండే చెక్కును తీసి వాటిని గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను గిన్నెలోకి తీసుకుని ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత కాకరకాయలను చేత్తో బాగా పిండి ముక్కలను ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు సగానికి పైగా వేగిన తరువాత టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత చింతపండు పులుసు, ఉప్పు, నీళ్లు వేసి కలపాలి. తరువాత కాకరకాయ ముక్కలు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించాలి. పులుసు ఉడికి నూనె పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేదు లేకుండా తయారు చేసిన కాకరకాయ పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.