Kobbari Chutney : మనం అల్పాహారాలను తినడానికి రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాం. చట్నీలతో తింటేనే అల్పాహారాలు మరింత రుచిగా ఉంటాయి. మనం సులభంగా తయారు చేసుకోగలిగే చట్నీ వెరైటీలలో కొబ్బరి చట్నీ కూడా ఒకటి. కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసి చేసే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. అలాగే ఎవరైనా చాలా సులభంగా ఈ చట్నీని తయారు చేసుకోవచ్చు. అల్పాహారాల రుచిని మరింత పెంచే కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక కప్పు, పుట్నాల పప్పు – అర కప్పు, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 10, అల్లం – అర ఇంచు ముక్క, చింతపండు – ఒక రెమ్మ, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు -తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్.
కొబ్బరి చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలను వేసి వేయించాలి. పల్లీలు వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చిని చిన్న మంటపై దోరగా వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, పల్లీలు, అల్లం, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత అర గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని చట్నీలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి చట్నీ తయారవుతుంది. దీనిని ఏ అల్పాహారంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చట్నీలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కొబ్బరితో కూడా చట్నీని తయారు చేసుకుని తినవచ్చు. ఈ చట్నీతో తింటూ అల్పాహారాల రుచి మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.