Kobbari Puri : మనం అల్పాహారంగా చేసుకునే వంటకాల్లో పూరీలు కూడా ఒకటి. పూరీలు చాలా రుచిగా ఉంటాయి. పూరీలను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనం సాధారణంగా పూరీలను తయారు చేయడానికి గోధుమపిండి, మైదాపిండి, పూరీ పిండి వంటి వాటిని ఉపయోగిస్తాము. ఇవే కాకుండా మనం బియ్యం పిండితో కూడా పూరీలను తయారు చేసుకోవచ్చు. కొబ్బరి, బియ్యం పిండి కలిపి చేసే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ పూరీలు కూడా చక్కగా పొంగుతాయి. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కొబ్బరి పూరీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పూరీల తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, బియ్యం పిండి – రెండు కప్పులు, వేడి నీళ్లు – ఒకటిన్నర కప్పులు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కొబ్బరి పూరీల తయారీ విధానం..
ముందుగా కొబ్బరి ముక్కలపై ఉండే నల్లటి భాగాన్ని తీసేసి ముక్కలను జార్ లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో బియ్యం పిండిని వేసి 2 నిమిషాల పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి, ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని పూరీ ప్రెస్ తో చెక్కలు వత్తిన మాదిరి ఈ పూరీలను వత్తుకోవాలి. లేదంటే ప్లాస్టిక్ కవర్ ను తీసుకుని దానికి నూనెను రాయాలి. తరువాత దానిపై పిండి ముద్దను ఉంచాలి.
ఈ పిండి ముద్దపై మరో కవర్ ను ఉంచి ప్లేట్ తో పూరీ లాగా వత్తుకోవాలి. ఇలా పూరీలను తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పూరీని వేసుకోవాలి. పూరీని వేయగానే గంటెతో నూనెలోకి వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల పూరీలు చక్కగా పొంగుతాయి. ఈ పూరీలను రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పూరీలు తయారవుతాయి. వీటిని కొబ్బరి చట్నీ, సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. తరచూ ఒకే రకం పూరీలు కాకుండా ఇలా వెరైటీగా కొబ్బరి పూరీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.