Konaseema Chepala Pulusu : కోన‌సీమ చేప‌ల పులుసు త‌యారీ ఇలా.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Konaseema Chepala Pulusu : చేప‌లు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు అందుతాయి. వైద్యులు కూడా వీటిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. చేప‌ల‌తో మ‌నం పులుసు, ఫ్రై, ఇగురు ఇలా అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చేప‌ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. చేప‌ల పులుసును చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ చేప‌ల పులుసును ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా త‌యారు చేస్తారు. అందులో భాగంగా కోన‌సీమ స్టైల్ లో చేప‌ల పులుసును రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చేప‌ల పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చేప ముక్క‌లు – కిలో, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 5, నాన‌బెట్టిన చింత‌పండు – 50 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – అర క‌ప్పు, గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు.

Konaseema Chepala Pulusu recipe in telugu how to make this
Konaseema Chepala Pulusu

చేప‌ల పులుసు త‌యారీ విధానం..

ముందుగా చేప ముక్క‌ల‌ను శుభ్రంగా క‌డిగి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ప‌సుపు, కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు పెనం మీద నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చేప ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని నిమిషం పాటు అటూ ఇటూ వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మెంతులు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌గా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో గ‌స‌గ‌సాలు, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత చింత‌పండు ర‌సం, ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని 10 నిమిషాల పాటు మ‌రిగించిన త‌రువాత చేప ముక్క‌ల‌ను వేసి నెమ్మ‌దిగా క‌ద‌పాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చేప‌ల పులుసు త‌యార‌వుతుంది. ఈ పులుసును అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే చేప‌ల పులుసు కంటే ఈ విధంగా చేసే చేప‌ల పులుసు మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts