Lacha Pakoda : మనం సాయంత్రం పూట బయట ఎక్కువగా లభించే చిరుతిళ్లల్లో పకోడీలు ఒకటి. పకోడీలను మనం ఇంట్లో కూడా తరచూ చేస్తూ ఉంటాం. పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధారణంగా మనం ఉల్లిపాయలతో ఈ పకోడీలను తయారు చేస్తూ ఉంటాం. కేవలం ఉల్లిపాయలే కాకుండా బంగాళాదుంపలతో కూడా మనం ఈ పకోడీలను తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసే ఈ లచ్చా పకోడాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే లచ్చా పకోడాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లచ్చా పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 3( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన కొత్తిమీర – గుప్పెడు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, తరిగిన కరివేపాకు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
లచ్చా పకోడా తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపల పై ఉండే చెక్కును తీయాలి. తరువాత ఈ బంగాళాదుంపలను చిన్నగా తురుముకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత ఈ తురుమును రెండు నుండి మూడు సార్లు బాగా కడిగి నీళ్లు లేకుండా చేత్తో పిండుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నీళ్లు పోయకుండా గట్టిగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి.
ఈ పకోడీలను మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా, కరకరలాడే వరకు వేయించుకోవాలి. తరువాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లచ్చా పకోడా తయారవుతుంది. ఇంట్లో అందరూ ఈ పకోడాలను ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ చేసే ఉల్లిపాయ పకోడీలతో పాటు అప్పుడప్పుడూ ఇలా బంగాళాదుంపలతో కూడా పకోడీలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని టమాట కిచప్ తో తింటే మరింత రుచిగా ఉంటాయి.