Walnuts : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో వాల్ నట్స్ కూడా ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనకు తెలిసిందే. వాల్ నట్స్ చూడడానికి మెదడు ఆకారంలో ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు అభివృద్ధికి వాల్ నట్స్ చక్కటి ఆహారమని అనేక పరిశోధనలు వెల్లడించాయి. పిల్లలకు రెండున్నర సంవత్సరాల నుండి వాల్ నట్స్ ను ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో మెదడు చక్కగా అభివృద్ధి చెందుతుంది. అలాగే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడులో కణాలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.
వాల్ నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల వాల్ నట్స్ లో 9 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. మన శరీరానికి రోజుకు 1.1 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవసరమవుతాయి. కనుక 5 లేదా 6 వాల్ నట్స్ ను రోజూ తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్లు లోపలికి వెళ్లిన తరువాత డి హెచ్ ఎ గా తయారవుతాయి. ఈ డి హెచ్ ఎ మెదడులో ఉండే కణాల మధ్య సంబంధాన్ని ఆరోగ్యంగా ఉండచంలో సహాయపడుతుంది. అలాగే మెదడు కణాలు కుశించుపోకుండా జీవిత కాలం పాటు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో కూడా వాల్ నట్స్ లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సహాయపడతాయి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు ప్రత్యేకమైన ఫాలీ ఫినాల్స్ కూడా ఈ వాల్ నట్స్ లో ఉన్నాయి.
మనం ఆలోచించినప్పుడు మన మెదడు కణాల్లో కొన్ని రకాల రసాయనాలు, ఫ్రీరాడికల్స్ విడుదల అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్, రసాయనాలు మెదడు కణాల పనితీరును తగ్గించడంతో పాటు వాటి జీవిత కాలాన్ని కూడా తగ్గిస్తాయి. కనుక ఫ్రీ రాడికల్స్ ను మెదడు కణాలు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటాయి. ఇలా మెదడు కణాలు ఎప్పటికప్పుడు ఫ్రీ రాడికల్స్ ను తొలగించేలా చేయడంలో మనకు వాల్ నట్స్ లో ఫాలీ ఫినాల్స్ సహాయపడతాయి. దీంతో మెదడు కణాలపై ఒత్తిడి తగ్గడంతో పాటు వాటి పనితీరు కూడా మెరుగుపడుతుంది. వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల ఈ విధంగా మన మెదడుకు ఎంతో మేలు కలుగుతుందని కనుక వీటిని ప్రతి ఒక్కరు ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 5 నుండి 6 వాల్ నట్స్ ను నానబెట్టుకుని మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.