Alu Samosa : మనకు బయట ఎక్కువగా దొరికే చిరుతిళ్లలో సమోసాలు కూడా ఒకటి. సమోసాలు ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. సమోసాలను చాలా మంది ఇష్టంగా తింటారు. మనకు వివిధ రుచుల్లో సమోసాలు లభ్యమవుతాయి. వీటిల్లో ఆలూ సమోసాలు కూడా ఒకటి. ఆలూ సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. బయట దొరికే విధంగా ఉండే ఆలూ సమోసాలను మనం చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రుచిగా ఆలూ సమోసాలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, ఉప్పు – రుచికి తగినంత, వాము – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – పావు కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, కచ్చా పచ్చాగా దంచిన సోంపు గింజలు – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
ఆలూ సమోసా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని, ఉప్పును, వామును, నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నీళ్లను పోసి బాగా కలిపి మూత పెట్టి అర గంట పాటు ఉంచాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసి మెత్తగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తరువాత పచ్చి మిర్చిని, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత సోంపు గింజలను వేసి వేయించుకోవాలి. తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ ను వేసి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కలిపి ఒక నిమిషంపాటు వేయించుకోవాలి.
తరువాత మెత్తగా చేసుకున్న బంగాళాదుంపలను వేసి కలిపి మరో 3 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి మిశ్రమాన్ని తీసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుంటూ ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుంటూ నూనె రాసుకుంటూ చపాతీలా వత్తుకుని రెండు సమాన భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో దానిని తీసుకుంటూ దాని అంచులకు కొద్దిగా నీళ్లను రాసుకుంటూ సమోసా ఆకారంలో చుట్టుకోవాలి.
దీనిలో ముందుగా తయారు చేసుకున్న ఆలూ మిశ్రమాన్ని ఉంచి అంచులు ఊడిపోకుండా గట్టిగా వత్తుకోవాలి. ఇలా అన్నీ సమోసాలను చుట్టుకున్న తరువాత కళాయిలో నూనె పోసి నూనె వేడయ్యే వరకు ఉంచాలి. నూనె వేడయ్యాక సమోసాలను వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఈ సమోసాలను మధ్యస్థ మంటపై కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ బయట దొరికే విధంగా ఉండే సమోసాలు తయారవుతాయి. సాయంత్రం సమయాల్లో ఇలా సమోసాలను చేసుకుని నేరుగా లేదా టమాట కెచప్ తో కలిపి తినవచ్చు. అపరిశుభ్ర వాతావరణంలో చేసే సమోసాలను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.