మనలో తీపిని ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. మన రుచికి తగినట్టుగానే మనం రకరకాల తీపి పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే మనకు కొన్ని సాంప్రదాయ తీపి వంటకాలు కూడా ఉంటాయి. వాటిల్లో బెల్లం తాలికల పాయసం కూడా ఒకటి. ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈ బెల్లం తాలికల పాయాసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం తాలికల పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడి బియ్యం పిండి – ఒక కప్పు, నానబెట్టిన సగ్గు బియ్యం – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – కొద్దిగా, జీడిపప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, నీళ్లు – 4 కప్పులు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, ఉప్పు – చిటికెడు, ఎండు కొబ్బరి పొడి – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
బెల్లం తాలికల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండు ద్రాక్షను ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించుకోవాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుమును వేసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత ఇందులో ఉప్పు, బియ్యం పిండి వేసి గంటెతో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత చేత్తో 5 నుండి 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తరువాత తగినంత పిండిని తీసుకుని తాలికలుగా వత్తుకోవాలి. ఇలా పిండిని అంతా తాలికలుగా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నీళ్లు పోసి అందులో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత ఎండు కొబ్బరి పొడిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలను కూడా వేసి ఉడికించుకోవాలి.
ఈ తాలికలు కొద్దిగా ఉడికిన తరువాత బెల్లం తురుమును వేసి నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసి అందులో పావు కప్పు నీళ్లను పోసి కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని దగ్గర పడే వరకు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం తాలికల పాయసం తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా ఏదైనా పర్వదినాలకు దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి ఇలా చాలా సులభంగా, రుచిగా బెల్లం తాలికల పాయసాన్ని చేసుకోవచ్చు.