Chicken Fried Rice : రెస్టారెంట్‌ల‌లో ల‌భించే విధంగా.. చికెన్ ఫ్రైడ్ రైస్‌.. త‌యారీ ఇలా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Chicken Fried Rice : మ‌న‌కు బ‌య‌ట పాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో అలాగే రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల వంట‌కాల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. దీనిని దాదాపుగా మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. బ‌య‌ట దొరికే విధంగా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ను మ‌నం చాలా సులభంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట దొరికే విధంగా రుచిగా, పొడి పొడిగా ఉండే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ఫ్రైడ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చికెన్ – 250 గ్రాములు, నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – 200 గ్రా., ఉప్పు – త‌గినంత‌, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, నీళ్లు – 4 గ్లాసులు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్లు – 2, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన క్యారెట్ ముక్క‌లు – పావు క‌ప్పు, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన క్యాప్సికం ముక్క‌లు – పావు క‌ప్పు, క్యాబేజ్ తురుము – పావు క‌ప్పు, త‌రిగిన బీన్స్ – అర క‌ప్పు, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, న‌ల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, త‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ – కొద్దిగా.

make Chicken Fried Rice in restaurant style recipe is here
Chicken Fried Rice

చికెన్ ఫ్రైడ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి ప‌లుచని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత ముక్క‌ల‌ను గిన్నెలోకి తీసుకుని అందులో అర టీ స్పూన్ ఉప్పును, ఒక టీ స్పూన్ వెనిగ‌ర్ ను వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ గిన్నెపై మూత ఉంచి 20 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో నీళ్ల‌ను, అర టీ స్పూన్ నూనెను, త‌గినంత ఉప్పును వేసి మరిగించుకోవాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. బియ్యం మెత్త‌గా ఉడికిన త‌రువాత నీళ్ల‌ను తొలగించి అన్నాన్ని జ‌ల్లిగిన్నెలోకి తీసుకుని నీళ్లు అన్నీ పోయేలా పొడిపొడిగా అయ్యేలా చేసుకోవాలి.

త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన త‌రువాత కోడిగుడ్ల‌ను వేసి అవి కొద్దిగా ఉడికిన త‌రువాత పెద్ద ముక్క‌లుగా చేసి వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత వెల్లుల్లి ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. త‌రువాత ముందుగా ఫ్రిజ్ లో పెట్టుకున్న చికెన్ ముక్క‌లను వేసి క‌లుపుతూ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకోవాలి. చికెన్ ఉడికిన త‌రువాత క్యారెట్, క్యాప్సికం, క్యాబేజ్, బీన్స్ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. త‌రువాత త‌గినంత ఉప్పును వేసి క‌లుపుకోవాలి.

ఈ ముక్క‌ల‌ను మ‌రీ మెత్త‌గా కాకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న త‌రువాత మిరియాల పొడిని, న‌ల్ల‌ మిరియాల పొడిని వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ముందుగా పొడిగా చేసి పెట్టుకున్న అన్నాన్ని, వేయించిన కోడిగుడ్ల‌ను, చిల్లీ సాస్ ను, సోయా సాస్‌, స్ప్రింగ్ ఆనియ‌న్స్ వేసి అన్నీ క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిని 2 నిమిషాల పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. దీనిని వేడిగా ఉన్న‌ప్పుడే తిన‌డం వ‌ల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల రెస్టారెంట్ లో ల‌భించే విధంగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. చికెన్ తో ఈ విధంగా చేసిన ఫ్రైడ్ రైస్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts