Sonthi : శొంఠి.. ఇది మనందరికీ తెలిసిందే. ఎండబెట్టిన అల్లాన్నే శొంఠి అంటారు. అల్లంపై ఉండే పొట్టును తీసి సున్నప్పు తేటలో ముంచి శొంఠిని తయారు చేస్తారు. ఆయుర్వేదంలో శొంఠిని అనేక వ్యాధులను నయం చేసే ఔషధంగా ఉపయోగిస్తారు. మొదటి ముద్దగా అన్నంలో శొంఠి పొడిని కలుపుకుని తినడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా ఆకలి కూడా పెరుగుతుంది. గోరు వెచ్చని నీటిలో శొంఠిపొడిని, తేనెను కలుపుకుని తాగడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు. జలుబుతో బాధపడుతున్నప్పుడు గోరు వెచ్చని నీటిలో శొంఠి పొడిని, మిరియాల పొడిని కలుపుకుని తాగడం వల్ల జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.
మైగ్రేన్ తలనొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు శొంఠి పొడిని తాటి బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల నొప్పి నుండి చక్కని ఉపశమనం లభిస్తుంది. శొంఠిని నీటితో అరగదీసి ఆ గంధాన్ని నుదుటి మీద రాయడం వల్ల ఎంతటి తీవ్రమైన తలనొప్పి అయినా తగ్గు ముఖం పడుతుంది. శొంఠి టీ తాగడం వల్ల వాత, కఫ, పిత్త దోషాలు తొలగిపోతాయి. వెక్కిళ్లు వచ్చినప్పుడు శొంఠి పొడిలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల వెక్కిళ్లు తగ్గిపోతాయి. శొంఠి, ధనియాలతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల వాత సంబంధిత నొప్పులు తగ్గుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను నయం చేయడంలో కూడా శొంఠి ఎంతగానో ఉపయోగపడుతుంది.
శొంఠి పొడి, సైంధవ లవణం, వామును సమాన భాగాల్లో తీసుకుని నిమ్మ రసంలో కలిపి ఉండలుగా చేసి ఎండబెట్టాలి. ఈ ఉండలను నిల్వ చేసుకుని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల గ్యాస్, వాంతులు, అజీర్తి, నులిపురుగులు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు శొంఠి పొడిని, బెల్లాన్ని కలిపి బాగా దంచి ఆ మిశ్రమాన్ని భద్రపరుచుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న మిశ్రమాన్ని అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలుపుకుని ఉదయం పరగడుపున, సాయంత్రం ఆరు గంటల సమయంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గు ముఖం పడతాయి.
అనేక రకాల ఉపయోగాలు ఉన్నప్పటికీ ఈ శొంఠిని తగు మెతాదులో మాత్రమే తీసుకోవాలి. అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా శొంఠిని ఉపయోగించి పలు రకాల అనారోగ్య సమస్యల నుండి మనం సులభంగా బయట పడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.