Chicken Tikka : సాధారణంగా చికెన్‌తో చేసే ఏ వంటకం అయినా సరే మాంసాహార ప్రియులకు నచ్చుతుంది. చికెన్‌తో కూర, వేపుడు, బిర్యానీ వంటివి సహజంగానే చేస్తుంటారు. అయితే చికెన్‌తో మనం రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ టిక్కాను కూడా తయారు చేయవచ్చు. ఓవెన్ లేకున్నా ఇంట్లోనే సులభంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ టిక్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ ముక్కలు (బోన్‌లెస్) – అర కిలో, శనగపిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్, పెరుగు – 1 కప్పు, కారం – 1 టీస్పూన్, మిరియాల పొడి – అర టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీస్పూన్, కసూరీ మేథీ – ముప్పావు టీస్పూన్, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా – అర టీస్పూన్.
చికెన్ టిక్కాను తయారు చేసే విధానం..
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఆ గిన్నెను ఫ్రిజ్‌లో 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీంతో ఆ మిశ్రమమంతా చికెన్ ముక్కలకు బాగా పడుతుంది. చికెన్ బాగా మారినేట్ అవుతుంది. అనంతరం ఆ ముక్కలను తీసి ఇనుప చువ్వలకు గుచ్చాలి. వాటిపై కాస్త నూనెను వేడి చేసి పైపూతగా రాయాలి. అనంతరం వాటిని నిప్పుల మీద కాల్చుకోవాలి.
అయితే ఇంట్లో నిప్పులు అందుబాటులో లేకపోతే.. పుల్కాలను కాల్చే పెంకును స్టవ్ మీద ఉంచాలి. అది చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే చికెన్ ముక్కలను గుచ్చిన ఇనుప ఊచలను ఆ పెంకు మీద ఉంచి కాల్చుకోవాలి. చికెన్ ముక్కలు ఎర్రగా, నల్లగా బాగా కలే వరకు ఉంచాలి. తరువాత ఊచలను తీయాలి. అనంతరం ముక్కలను ఊచల నుంచి తీయాలి. దీంతో రుచికరమైన చికెన్ టిక్కా తయారవుతుంది. వీటిని అలాగే తినవచ్చు. లేదా పుదీనా చట్నీలో ముంచుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.