Gulab Jamun : ఇన్‌స్టంట్ మిక్స్ లేకున్నా.. గులాబ్ జామున్‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Gulab Jamun : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ తీపి ప‌దార్థాల‌ను కూడా తయారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే తీపి ప‌దార్థాల్లో గులాబ్ జామున్ కూడా ఒక‌టి. గులాబ్ జామున్ ను ఇష్టంగా తినే వారు చాలా మందే ఉంటారు. అయితే మ‌నం సాధార‌ణంగా గులాబ్ జామున్ మిక్స్ ను ఉప‌యోగించి గులాబ్ జామున్ ను త‌యారు చేస్తూ ఉంటాం. ఎటువంటి ఇన్ స్టాంట్ మిక్స్ లేకుండా కూడా బొంబాయి ర‌వ్వ‌ను ఉప‌యోగించి మ‌నం చాలా సులువుగా గులాబ్ జామున్ ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. బొంబాయి ర‌వ్వ‌తో గులాబ్ జామున్ ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గులాబ్ జామున్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, పంచ‌దార – రెండు క‌ప్పులు, నీళ్లు – రెండు క‌ప్పులు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, పాలు – రెండున్న‌ర క‌ప్పులు, నూనె – డీప్‌ ఫ్రై కి స‌రిప‌డా.

make Gulab Jamun in this way without instant mix
Gulab Jamun

గులాబ్ జామున్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి వేసి నెయ్యి క‌రిగిన త‌రువాత బొంబాయి రవ్వ‌ను వేసి రంగు మారే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత‌ మ‌రో గిన్నెలో పంచ‌దార‌ను, నీళ్ల‌ను పోసి పంచ‌దార క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత యాల‌కుల పొడి వేసి క‌లిపి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో పాల‌ను పోసి పాలు పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత ఈ పాల‌లో వేయించిన బొంబాయి రవ్వ‌ను వేసుకుంటూ ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. పాలు, బొంబాయి ర‌వ్వ పూర్తిగా క‌లిసిపోయి క‌ళాయికి అతుక్కోకుండా గ‌ట్టిగా అయ్యే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కావ‌ల్సిన ప‌రిమాణంలో తీసుకుంటూ ఉండ‌లుగా చుట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత గులాబ్ జామున్ ఉండ‌ల‌ను వేయాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని జ‌ల్లిగంటె స‌హాయంతో బ‌య‌ట‌కు తీయాలి. ఇలా తీసిన వాటిని వెంట‌నే ముందుగా త‌యారు చేసి పెట్టుకున్న పంచ‌దార మిశ్ర‌మంలో వేయాలి. ఇలా అన్ని ఉండ‌ల‌నూ పంచ‌దార మిశ్ర‌మంలో ఉంచిన త‌రువాత గిన్నెపై మూత ఉంచి 2 నుండి 3 గంట‌ల పాటు కదిలించ‌కుండా ఉంచాలి. త‌రువాత గులాబ్ జామున్ ల‌ను గిన్నెలోకి తీసుకుని తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గులాబ్ జామున్ త‌యార‌వుతుంది. గులాబ్ జామున్ మిక్స్ అందుబాటులో లేన‌ప్పుడు లేదా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా రుచిగా గులాబ్ జామున్ ల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts