Tomato Charu : మనం టమాటాలను ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. టమాటాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బీపీని, కంటి సమస్యలను తగ్గించడంలో టమాటాలు ఎంతో సహాయపడతాయి. టమాటాలను ఉపయోగించి టమాట పప్పు, టమాట పచ్చడితోపాటు వివిధ కూరగాయలతో కలిపి కూడా మనం వంటలను తయారు చేస్తూ ఉంటాం. టమాటలతో మనం చారు, రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇతర ఆహార పదార్థాలతో తయారు చేసే చారు లాగే టమాటాలతో చేసే చారు కూడా చాలా రుచిగా ఉంటుంది. టమాటాలతో రుచిగా చారును ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 3 (పెద్దవి), చింతపండు – 20 గ్రా., పసుపు – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, దంచిన వెల్లుల్లి – 4, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చి మిర్చి – 2, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ.
చారు పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 3, ఎండు మిరప కాయలు – 3, పసుపు – పావు టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, ఇంగువ – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, కందిపప్పు – రెండు టేబుల్ స్పూన్స్, ఉలవలు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – కొద్దిగా.
టమాటా చారు తయారీ విధానం..
ముందుగా చింతపండును తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఇప్పుడు ఉప్పు, ఇంగువ, పసుపు తప్ప మిగిలిన చారు పొడి తయారీకి కావల్సిన పదార్థాలను కొద్దిగా వేయించి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిలో ఉప్పు, పసుపు, ఇంగువను వేసి కలుపుకోవాలి. తరువాత రెండు టమాటాలు ముక్కలుగా చేసుకుని జార్ లో వేసి మెత్తగా చేసుకోవాలి. మిగిలిన టమాటాలను పొడుగ్గా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుండి చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని మెత్తగా చేసుకున్న టమాటా గుజ్జుతో కలిపి వడకట్టుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగాక తాళింపు పదార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేగిన తరువాత పసుపు, కారం, రసం పొడి వేసి కలిపి ముందుగా వడకట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడేలా ఉప్పు, తగినన్ని నీళ్లను పోసి మరిగించుకోవాలి. చివరగా తరిగిన కొత్తిమీరను వేసి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాటా చారు తయారవుతుంది. అన్నంతో కలిపి టమాట చారును తీసుకోవడం వల్ల రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.