Ivy Gourd Fry : మనం అనేక రకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో ఒకటి దొండకాయ. కానీ దొండకాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. దొండకాయను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కండరాలు బలంగా తయారవుతాయి. అంతే కాకుండా హైబీపీని తగ్గించడంలోనూ దొండకాయ ఎంతో సహాయపడుతుంది. చర్మం నిగారించేలా చేసే శక్తి దొండకాయకు ఉంది. శరీరంలో ఉండే వాపులను తగ్గించడంలో కూడా దొండకాయ ఉపయోగపడుతుంది. ఇక దొండకాయతో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. సరిగ్గా చేయాలే కానీ దొండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే దొండకాయ ఫ్రై ను రుచిగా ఎలా తయారు చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – అర కిలో, పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 15, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికిసరిపడా, కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్.
దొండకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా దొండకాయలను కడిగి సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తరువాత పల్లీలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. వీటితో పాటు కారం, ఎండు కొబ్బరి పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగాక తరిగిన దొండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తరువాత పసుపు, ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమం వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా వీటితో మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.