Kova Kajjikayalu : మనం తయారు చేసే సంప్రదాయ వంటకాల్లో కోవా కజ్జకాయలు ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మనకు బయట స్వీట్ షాపుల్లో కూడా ఇవి లభ్యమవుతాయి. ఒక చుక్క నూనె, నెయ్యి వాడకుండా కూడా ఈ కోవా కజ్జకాయలను మనం తయారు చేసుకోవచ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఈ కజ్జ కాయలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోవా కజ్జకాయల తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి కాయ – 1, బెల్లం తరుము – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, చిక్కటి పాలు – ఒక లీటర్, పంచదార – 2 టీ స్పూన్స్.
కోవా కజ్జికాయల తయారీ విధానం..
ముందుగా కొబ్బరికాయ నుండి కొబ్బరిని వేరు చేసుకోవాలి. తరువాత దానిపై బ్రౌన్ కలర్ లో ఉండే చెక్కును తీసేసి కొబ్బరిని ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ కొబ్బరి ముక్కలను జార్ లో వేసి తురుములా చేసుకోవాలి. ఇలా తయారు చేసిన కొబ్బరి తురుము – ఒక కప్పు ఉండేలా చూసుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఈ కొబ్బరి తురుమును, బెల్లం తురుమును వేసి వేడి చేయాలి. బెల్లం కరిగి కొబ్బరి ఉడికిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమం మరీ పొడిబారక ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత ఉండలుగా చేసి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. తరువాత అడుగు భాగం మందంగా ఉండే కళాయిని తీసుకుని అందులో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరిగి దగ్గర పడిన తరువాత పంచదారను వేసి కలపాలి.
పాలు మరిగి కోవా తయారయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముక్కలుగా ఉండే ఈ కోవాను చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి. తరువాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండలకు తగినంత కోవాను తీసుకుని చెక్క అప్పలా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తరువాత దాని మధ్యలో కొబ్బరి ఉండను ఉంచి అంచులను మూసి వేసి గుండ్రంగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కమ్మటి రుచిని కలిగి ఉండే కోవా కజ్జకాయలు తయారవుతాయి. పండుగల సమయంలో, ప్రత్యేకమైన రోజులప్పుడు ఇలా కోవా కజ్జకాయలను తయారు చేసుకుని తినవచ్చు. వీటి తయారీలో అన్నీ కూడా మనం ఆరోగ్యానికి మేలు చేసేవే. కనుక వీటిని తినడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగదు.