Palak Curry : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. దీనిని మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పాలకూరతో పప్పు, పాలక్ రైస్, కూర, పాలక్ పన్నీర్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. పాలకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు దీనిని తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. పాలకూరతో కూరను అన్నంలోకి కాకుండా చపాతీ, పుల్కా వంటి వాటిని తినడానికి ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలకూర కట్టలు – 4, పెద్దగా తరిగిన టమాటాలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చి మిర్చి – 5, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క ముక్కలు – 2, యాలకులు – 2, లవంగాలు – 3, సాజీరా – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (పెదద్ది), అల్లం వెల్లుల్లి పేస్ట్ -2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, ఉప్పు- తగినంత.
పాలక్ కర్రీ తయారీ విధానం..
ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి ఒక కళాయిలో వేసుకోవాలి. ఇందులోనే టమాట ముక్కలను, పచ్చి మిర్చిని వేసి మూత పెట్టాలి. పాలకూరను మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికించిన పాలకూర మిశ్రమం చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.
ఉల్లిపాయలు పూర్తిగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత పసుపు, ధనియాల పొడి వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసి తగినన్ని నీళ్లు పోసి 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. తరువాత తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ కర్రీ తయారవుతుంది. దీనిని పుల్కా, రోటీ, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పాలకూరతో కూరను చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.