Malidalu : మలిదా లడ్డూ.. చపాతీలతో చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. సాంప్రదాయ తెలంగాణా వంటకమైన ఈ మలిదా లడ్డూలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ లడ్డూలు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా, కమ్మగా ఉంటాయి. ఇంట్లో మిగిలిన చపాతీలతో కూడా ఈ లడ్డూలను అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ మలిదా లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మలిదా లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒకటిన్నర కప్పు, ఉప్పు – కొద్దిగా, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, గసగసాలు – 2 టీ స్పూన్స్, ఎండుకొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్, బెల్లం తురుము – అర కప్పు.
మలిదా లడ్డూల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి కలపాలి. తరువాత నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత పైన నెయ్యి వేసి కలిపి మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. తరువాత గసగసాలు, ఎండుకొబ్బరి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పిండిని తీసుకుని మరోసారి కలిపి ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా కాల్చుకోవాలి. తరువాత వీటిని వేడి వేడి పెనం మీద వేసి నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. కాల్చిన చపాతీలు ఒక దాని మీద ఒకటి వేస్తే చెవట వచ్చి మెత్తగా అవుతాయి.
కనుక వీటిని కాల్చుకున్న తరువాత ఆరబెట్టాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిని ముక్కలుగా చేసి జార్ లో వేసుకోవాలి. ఈ చపాతీలను మెత్తని పొడిలా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. తరువాత బెల్లం తురుము వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలిపి లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మలిదా లడ్డూలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు లేదా చపాతీలు ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.